కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌లే...బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇందులోనే రైల్వే బ‌డ్జెట్ ఉంది. ఈ నేప‌థ్యంలో..స‌హ‌జంగానే తెలుగు రాష్ట్రాల‌కు ఏం ద‌క్కింద‌నే ఆస‌క్తి ఉంటుంది. తాజాగా దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా ఈ  మేర‌కు వివ‌రాలు వెల్ల‌డించారు. ఇప్పటివరకు హైద‌రాబాద్‌ నగరం నుంచి రైల్వేకు సంబంధించిన రైళ్లు మాత్రమే రాకపోకలు సాగిస్తుండగా త్వరలో నగరంలోని స్టేషన్ల నుంచి ప్రైవేటు రైళ్లు ప్రయాణికుల కోసం వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించనున్నాయని దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా వెల్ల‌డించారు.

 

తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌(పీపీపీ) విధానంలో అందుబాటులోకి రానున్న రైళ్ల గురించి దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా తెలిపారు. చర్లపల్లి, లింగంపల్లి స్టేషన్ల నుంచి శ్రీకాకుళం, గుంటూరు, విశాఖపట్నం తిరుపతి తదితర ప్రాంతాలకు ప్రైవేటు రైళ్లు నడుపనున్నారని ఆయ‌న వెల్ల‌డించారు. త్వరలో టెండర్లు ఆహ్వానించనున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పింక్‌ బుక్‌లో ఈ విషయాలను పేర్కొనట్లు దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా వెల్ల‌డించారు. కాగా, కొత్త రైళ్లు అందుబాటులోకి వ‌స్తే...గ‌తంలో ఉన్నట్లు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ఒత్తిడి త‌గ్గుతుంద‌ని..ప్ర‌యాణం సైతం సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని ప‌లువురు భావిస్తున్నారు. టెండ‌ర్లు, ఇత‌ర  ప్ర‌క్రియలు పూర్త‌యి వ‌చ్చే ఏడాదిలో అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

 

కాగా, హైద‌రాబాద్‌లో ఎంఎంటీఎస్ విష‌యంలోనూ తీపిక‌బురు వినిపించారు. ఎంఎంటీఎస్‌ రెండోదశకు  ప్రస్తుత బడ్జెట్‌లో రూ.40 కోట్లు కేటాయించారు.మౌలాలి నుంచి ఘట్‌కేసర్‌, మల్కాజిగిరి నుంచి బొల్లారం మీదుగా మేడ్చల్‌ వరకు కొన్ని పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటికోసం రూ.40 కోట్లు కేటాయించింది. 2017 నాటికి పూర్తిచేస్తామని ప్రకటించినప్పటికీ ఇంకా పూర్తి కాన‌ప్ప‌టికీ...త‌క్కువ నిధులు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.  కాగా, నగరంలోని కాచిగూడ, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ స్టేషన్ల మీద ఒత్తిడి తగ్గించేందుకు నిర్మిస్తున్న శాటిలైట్‌ చర్లపల్లి టెర్మినల్‌కు రూ.5 కోట్లు కేటాయించారు. అదేవిధంగా పీపీపీ పద్ధతిలో చేపట్టనున్న వట్టినాగులపల్లి టెర్మినల్‌కు ఎటువంటి కేటాయింపులు లేవు. 

మరింత సమాచారం తెలుసుకోండి: