కరోనా విషయంలో చైనా వాస్తవాలను దాచి పెడుతుందా? కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తున్నా తక్కువ చేసి చూపిస్తుందా ?  చైనాకు చెందిన కొన్ని కంపెనీలు అవుననే అంటున్నాయి. కరోనా మరణాలు వేలల్లో ఉంటే... చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం మాత్రం ఐదు వందలు దాటలేదని తప్పుడు లెక్కలు చెబుతున్నట్లు ఆ కంపెనీలు చెబుతున్నాయి. మరోవైపు కరోనా వైరస్ బాధితులను సామూహికంగా చంపేందుకు అనుమతివ్వాల్సిందిగా చైనా పీపుల్స్‌ కోర్టును ప్రభుత్వం కోరినట్టు వార్తలొస్తున్నాయి.

 

కరోనా వైరస్ మహమ్మారిలాగా చైనా మొత్తం వ్యాపిస్తుంటే...అక్కడి ప్రభుత్వం మాత్రం ఏదో దాస్తుందన్న అనుమానాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా వుహాన్ నగరంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన ఎన్ని చర్యలు చేపట్టనా , ప్రత్యేక ఆస్పత్రులు నిర్మించినా...వైరస్ మాత్రం వేగంగా విస్తరిస్తూనే ఉంది. కరోనా ప్రభావిత లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చే వాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 

 

అధికారిక లెక్కల ప్రకారం కరోనా వైరస్ ఇప్పటి వరకు 564 మందిని బలితీసుకుంది. అయితే ప్రభుత్వం చెబుతున్న లెక్కకు చైనాకు చెందిన కొన్ని పత్రికలు, కంపెనీలు వెల్లడిస్తున్న వివరాలకు చాలా తేడా ఉంటోంది. కరోనా వైరస్ ను మొదటి నుంచి పరిశీలిస్తున్న చైనాకు చెందిన రెండో అతి పెద్ద కంపెనీ  టెన్‌సెంట్... చేసిన ప్రకటన ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేస్తోంది. కరోనా వైరస్ కారణంగా చైనాలో ఇప్పటి వరకు 24,589 మంది మరణించారని ఆ సంస్థ ప్రకటించింది. సంస్థకు చెందిన వెబ్ సైట్‌లో ఈ డేటాను ప్రచురించింది.

 

టెన్‌సెంట్ ప్రకారం చైనాలో ఇప్పటి వరకు లక్షా 54 వేలమందికి కరోనా వైరస్ సోకింది. ప్రభుత్వం చెబుతున్న లెక్కల కన్నా ఈ మరణాలు 80 శాతం ఎక్కువ. అధికారులు ప్రకటించే సమాచారంలో వంద రెండు వందలు అటూ ఇటుగా ఉంటే పెద్దగా పట్టించుకోనవసరం లేదు. కానీ
చైనాలోనే రెండో అతిపెద్ద కంపెనీగా ఉన్న టెన్‌సెంట్ మాత్రం ప్రభుత్వం చెబుతున్న లెక్కలను తప్పుపడుతుంది...  ఐదు వందలు ఎక్కడ... 24 వేలు ఎక్కడ...?  కరోనా కారణంగా వుహాన్ నగరం స్మశానంగా మారుతున్నా... అక్కడి ప్రభుత్వం ప్రపంచ దేశాలకు వాస్తవాలు వెల్లడించడం లేదన్న అనుమానాలు క్రమంగా పెరుగుతున్నాయి.

 

కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శించడం వల్ల... ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న కారణంతో మరణాలు తక్కువ చేసి చూపుతున్నట్లు చైనా కంపెనీలు చెబుతున్నాయి.  కరోనా మరణాలను తక్కువ చేసి చూపించాల్సిందిగా వైద్యులపై అధికారులు ఒత్తిడి చేసి చూపుతున్నట్లు అనుమానిస్తున్నారు.  కరోనా వైరస్ చైనాలో విజృంభించి మూడు వారాలు దాటి పోయింది. 

 

ఇప్పటి వరకు హుబెయ్ ప్రావిన్స్‌కు మాత్రమే పరిమితమైన మరణాలు ఇప్పుడు సమీపంలోని తెంయిజిన్, హెలాంగ్‌జంగ్, గుజోల్లో కూడా నమోదవుతున్నాయి . చైనాలో కరోనా వైరస్ లక్షణాలను తొలిసారిగా గుర్తించిన డాక్టర్ వెన్లియాంగ్ కూడా ప్రాణాలు కోల్పోయారు. వుహాన్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్న వెన్లియాంగ్ కరోనా లక్షణాలను గుర్తించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలోనూ కరోనాకు సంబంధించిన పోస్టులను పెట్టారు. అయితే కరోనా గురించి మాట్లాడొద్దని పోలీసులు హెచ్చరించడంతో ఆయన మౌనంగా ఉండిపోయారు. వుహాన్ సెంట్రల్ ఆస్పత్రిలో కంటి వైద్యుడిగా పనిచేస్తున్న వెన్లియాంగ్ కరోనా లక్షణాలతో కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: