తెలుగు దేశం పార్టీ.. ఈ వారం ఏం చేసిందో తెలుసా? చాలా చేసింది లెండి.. అందులో కొన్ని మీకోసం.. వారం మొదటి రోజు

 

ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం.. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సొంత గ్రామం చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుకు అనుకూలంగా సభ నిర్వహించడంపై టీడీపీ నేతలు చెవులు కోసుకున్నారు. 

 

నారావారిపల్లిలో వైసీపీ సభను ప్రభుత్వ దాడిగా భావిస్తున్నట్లు టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే వైసీపీ ప్రభుత్వానిదే బాధ్యత అని వర్ల హెచ్చరించారు. వైసీపీ సభకు పోలీసులు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. తాము ఎప్పుడైనా చెవిరెడ్డి సొంతూరు తుమ్మలగుంటలో సభ పెట్టామా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు.

 

ఇంకా 3వ తేదీ సోమవారం.. మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులకు శాసనమండలిలో బ్రేకులు వేశారు. ఆ తర్వాత మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేయడం.. తర్వాతి పరిణామాలు చక,చకా జరిగాయి. అయితే ఆరోజూ మాత్రం జగన్ సర్కార్‌కు టీడీపీ షాకిచ్చింది.. ఈ రెండు బిల్లులపై సెలక్ట్ కమిటీ ఏర్పాటు దిశగా పావులు కదిపింది. ఏకంగా మండలి ఛైర్మన్‌కు కమిటీ సభ్యులుగా టీడీపీ నుంచి ఎమ్మెల్సీలను ప్రతిపాదించింది. ఈ మేరకు ఆ పేర్లను పంపించింది. 

 

ఇంకా 4వ తేదీ మంగళవారం.. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మూడు రాజధానుల ఏర్పాటుపై అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.  రాష్ట్ర రాజధాని అంశం తమ పరిధిలోనిది కాదని స్పష్టం చేసింది. దీంతో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కారణంగా ఆరోజు రాజధాని అంశంపై వైసీపీ ప్రభుత్వానికి తీపికబురు అందింది. 

 

ఇంకా 5వ తేదీన బుధువారం.. తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు పోరాటం చేస్తే వారికి తాము కూడా మద్దతిస్తామని రామ్మోహన్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంకా అదే రోజు.. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న బాబు.. ఏపీ టీడీపీ అధ్యక్షుడ్ని మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లు అందుకు కొన్ని పేర్లను కూడా టీడీపీ జాతీయ అధ్యక్షుడు పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

 

ఇంకా 6వ తేదీన గురువారం.. టీడీపీ సీనియర్ నేత, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. కడప జిల్లాతో పాటూ హైదరాబాద్‌లోని నివాసాల్లో గురువారం ఉదయం నుంచి 10మంది ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసరెడ్డికి చెందిన ఆర్కే ఇన్‌ఫ్రాలో కూడా ఈ తనిఖీలు జరిగాయి. ఇంకా అలాగే ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమర్శలు గుప్పించారు. ఇంకా ఆరోజే కియా మోటార్స్ తరలిపోతుందన్న వ్యాఖ్యలు లోక్‌సభలోనూ దుమారం రేపాయి. టీడీపీ-వైఎస్సార్‌సీపీ ఎంపీల మధ్య మాటల యుద్ధాన్ని రేపాయి. కియా ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోతోందని.. అలాగే చాలా కంపెనీలు వెనక్కు వెళుతున్నాయని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు సభలో ప్రస్తావించారు. రామ్మోహన్ వ్యాఖ్యలకు వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కియాను తరలిస్తున్నారన్నది అవాస్తవమని చెప్పారు.

 

ఇంకా 7వ తేదీన శుక్రవారం.. మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్‌పై టీడీపీ ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు సెటైర్లు వేశారు. ఇంకా అలాగే చిట్టిబాబు నారా లోకేష్ కూడా ట్విట్టర్ లో వైసీపీ ఎంపీపై జోకులు  వేసి ఆరోజు ట్రెండ్ అయ్యారు. ఏ పదం ఎలా పలకాలో ఇంగ్లీష్ బిడ్డ నారా లోకేష్ వైసీపీ ఎంపీకి నేర్పించే అంత ఎత్తు ఎదిగిన రోజు అదే. 

 

ఇంకా 8వ తేదీన శనివారం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు దారుణమైన విమర్శలు చేశారు. కరోనా వైరస్‌తో వైసీపీని ముడిపెట్టి వరుస ట్వీట్లు చేశారు. కరోనా వైరస్ చైనాను అతలాకుతలం చేస్తోందని, వైసీపీ వైరస్ ఇప్పుడు దాన్ని మించిపోయిందని విమర్శించారు. 

 

ఇవి ఈ వారం టీడీపీ చేసిన గొప్ప గొప్ప పనులు.. మరో వారం మళ్ళి టీడీపీ చేసిన గొప్ప పనుల గురించి మళ్ళి తెలుసుకుందాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: