ఐటీ రంగంలో స‌త్తా చాటుతున్న తెలంగాణ ప్ర‌భుత్వం ద్వితీయ శ్రేణి న‌గ‌రాల‌కు సైతం ఈ ఫ‌లాల‌ను అందించాల‌ని నిర్ణ‌యించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా, స్థానిక యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా అతి తక్కువ వ్యవధిలో నిర్మించిన కరీంన‌గ‌ర్ ఐటీ టవర్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. తాజాగా ఈ వివ‌రాల‌ను మంత్రి గంగుల కమలాకర్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్ వెల్ల‌డించారు.

 


హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మిగతా పట్టణాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారని... అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగానే జిల్లాలో ఐటీ టవర్‌ను నిర్మించామన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నిరుద్యోగ యువతకు ఎక్కడికక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ జిల్లాల్లో ఐటీ టవర్లు, పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇది కంపెనీల‌కు, ఉద్యోగుల‌కు మేలు చేస్తుంద‌న్నారు. కంప్యూటర్ శిక్షణ ఇస్తే చాలనుకునే పరిస్థితి నుంచి ఐటీ కంపెనీలు స్థాపించే స్థాయికి కరీంనగర్ ఎదిగిందన్నారు. తక్కువ జీవన వ్యయంతో ఐటీ ఉద్యోగులకు కరీంనగర్ అనుకూలంగా మారబోతోందని చెప్పారు.హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగితో పోలిస్తే కరీంనగర్‌ ఐటీ ఉద్యోగికి రూ.30 వేలు జీవన వ్యయం ఆదా అవుతుందన్నారు. మొత్తం 26 కంపెనీలు తమను  సంప్రదించాయని, 15 కంపెనీలతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నామని ఆయన చెప్పారు.కరీంనగర్‌ వాళ్లకే 80 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. మొత్తం 3000 నుంచి 3600 మందికి ఇక్కడ ఉపాధి లభిస్తుందని తెలిపారు. తొలి రోజునే దాదాపు 400 మంది ఉద్యోగులు కరీంనగర్‌ ఐటీ టవర్‌లో పని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. 2014 లో తెలంగాణ  వచ్చినప్పుడు ఎంతో మంది అభివృద్ధిపై అనుమానాల వ్యక్తం చేశార‌ని..వాటిని పటాపంచలు చేస్తూ అనేక పనులు సీఎం చేసి చూపిస్తున్నారన్నారు 

 

2018 జనవరి 8న మంత్రి కేటీఆర్‌ ఐటీ టవర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రెండేళ్లలోనే ఐటీ టవర్‌ నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. హై ఫ్రీక్వెన్సీ ఇంటర్‌నెట్‌, నిరంతర విద్యుత్‌, పవర్‌ బ్యాక్‌ అప్‌ జనరేటర్‌ సెంట్రలైజ్డ్‌ ఏసీ వంటి అధునాతన సదుపాయాలు కల్పిస్తున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కంపెనీలకు ఇన్సెంటివ్‌లు ఇస్తున్నారు. మరో టవర్‌ కోసం 3 ఎకరాలు సిద్ధంగా ఉంచిన‌ట్లు స‌మాచారం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: