కోవిడ్‌-19..! ఈ పేరు వింటనే ప్రపంచదేశాలు హడలెత్తిపోయే పరిస్థితి. ఈ మహమ్మారి ఆసియా అగ్రరాజ్యం చైనాను అతలాకుతలం చేసింది. దీన్ని చూసి ప్రపంచదేశాలు నిద్రలేని రాత్రులను గడుపుతున్నాయి. ఇంతటి మహమ్మారిని చూసి కేరళ మాత్రం బెదరలేదు. ఆ మాయాదారి వైరస్‌ మెడలు వంచారు కేరళ వైద్యులు. దేశంలోనే మూడు పాజిటివ్‌ కేసులు నమోదైన అధైర్యపడకుండా.. కరోనాకు కేరళ చెక్‌ పెట్టిన విధానం ప్రపంచదేశాలకే ఆదర్శంగా నిలిచింది. 

 

కోవిడ్‌-19 కల్లోలానికి అంతేలేకుండా పోతోంది. కొద్ది రోజులుగా ప్రపంచ దేశాలకు నిద్రపట్టకుండా చేస్తూ..  15 వందలకు పైగా ప్రాణాలను బలిగొంది కోవిడ్‌-19. ఇన్నాళ్లూ చైనా సమస్యగా మారిన కరోనా ఇప్పుడు ప్రపంచ సమస్యలా పరిణమించింది. ఈ  వైరస్ 25కి పైగా దేశాల్లో ఉంది. ఇందులో అభివృద్ధి చెందినవి, చెందుతున్నవి ఉన్నాయి. వుహాన్‌లో మాదిరిగా వైరస్ విస్తరించడం మొదలు పెడితే... కొన్ని దేశాలు వైరస్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. సార్స్‌, మెర్స్, ఎబోలా, స్వైన్‌ఫ్లూ లాంటి అనేక వైరస్‌లను మించి ప్రపంచ దేశాలను భయపెడుతోంది కరోనా. ఇన్ని దేశాలను భయపెడుతున్న కరోనాను కేరళ విజయవంతంగా ఎదుర్కొంది. ఆ ప్రయత్నాల్లో సక్సెస్‌ కూడా అయింది.

 

కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి చెందకుండా కేరళ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయడంతో పాటు, ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం స్పందించింది. ఆరోగ్య మంత్రి కె.కె.శైలజ నిరంతరం పర్యవేక్షణ జరుపుతూ అధికారులందర్నీ అప్రమత్తంగా ఉంచారు. త్రిస్సూర్‌లో మొదటి కరోనా వైరస్‌ నిర్ధారణ అయిన వెంటనే అర్ధరాత్రి వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఫలితంగా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందకుండా నిలువరించగలిగారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే సమయానికే అలప్పుజా, కాసర్‌గాడ్‌ కు చెందిన మరో ఇద్దరు విద్యార్థులకు కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ ముగ్గురు విద్యార్థులు చైనాలో వుహాన్‌ నుండి కేరళకు చేరుకున్నారు. దీంతో అలర్ట్‌ అయిన కేరళ ప్రభుత్వం మరొకరికి వ్యాపించకుండా చర్యలు తీసుకోవడంలో  సఫలమైంది. ఒక దశలో రాష్ట్ర విపత్తుగా ప్రకటించి ఫోకస్ మొత్తం కరోనాను తరిమి కొట్టడంపైనే పెట్టింది పినరయి విజయన్ ప్రభుత్వం.  కేరళ వైద్యుల చికిత్స కారణంగా ముగ్గురు కరోనా బాధితులు పూర్తిగా రికవరీ అయ్యారు. ఈ ముగ్గురిని ఐసోలేటెట్‌ వార్డుల్లో ఉంచి నిరంతరం వైద్యసేవలు అందించి దాన్ని అదుపులోకి తీసుకొచ్చారు.

 

ఇలాంటి వైరస్‌లు కేరళకు కొత్తకాదు. గతంలో రాష్ట్రాన్ని భయపెట్టిన నిఫా, జికాలపై ఎలా విజయం సాధించిందో అదే వ్యూహాన్ని కోవిడ్‌పై ప్రయోగించింది కేరళ ప్రభుత్వం. కరోనాను అడ్డుకునేందుకు బహుళ అంచెల యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోకి ఈ వైరస్ ప్రవేశించకుండా అడ్డకట్ట వేసేందుకు తొలి వలయంగా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఉంటారు. వీరు ప్రమాదకర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. వీరిలో వైరస్ లక్షణాలున్నట్టైతే, అనుమానితులనే కాకుండా, వారితోపాటు సన్నిహితంగా ఉన్నవారినీ ట్రాకింగ్ సిస్టం పర్యవేక్షణలో ఉంచుతారు. తర్వాతి స్థాయిల్లో పోలీసులు, పంచాయితీలు, స్థానిక వాలంటీర్లు, వైద్యాధికారులు ఉంటారు. వీరంతా కరోనా వైరస్‌ గురించి భారీ ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం కరోనా లక్షణాలు కలిగిన 2 వేలకు పైగా అనుమానితులకు కేరళ సర్కార్‌ వైద్య పరీక్షలు నిర్వహించింది. అదే విధంగా కరోనాను ఎదుర్కొనేందుకు కేరళ ఆరోగ్య శాఖ ఐదు విమానాశ్రయాల్లో అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచింది. ప్రతి జిల్లాలోనూ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వార్డులను ఏర్పాటు చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: