తెలంగాణా ముఖ్యమంత్రిగా కేటిఆర్ బాధ్యతలు చేపట్టడం ఖాయం అంటూ సోషల్ మీడియాతో పాటుగా ప్రధాన మీడియా లో ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. గత నాలుగు నెలల నుంచి ఈ ప్రచారం మరీ పెరిగింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెరాస విజయం సాధించడంతో కాస్త దూకుడు పెంచి మరీ ఈ ప్రచారం చేస్తున్నారు. కేటిఆర్ కారణంగానే తెరాస విజయం సాధించింది కాబట్టి ఇక ఆయనకు పార్టీ బాధ్యతలు ఇవ్వాలీ అంటూ తెరాస నేతలు కూడా తమ మనసులో మాట బయటపెట్టి చిన్న యువరాజుని బుట్టలో వేసుకునే కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు. 

 

వాస్తవానికి కెసిఆర్ కూడా కేటిఆర్ విషయంలో దూకుడుగానే వెళ్ళారు. కానీ కొన్ని కొన్ని ఇబ్బందులను ఆయన ముందు ఊహించి కేటిఆర్ కి జరగబోయే పట్టాభిషేకాన్ని ఆపేశారు. అసలు కారణం ఏంటీ అనేది ఒక్కసారి చూస్తే, మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి ఓడిపోయిన నేపధ్యంలో ముంబై కేంద్రం నుంచి జారిపోయింది. అంతకు ముందు బిజెపి అధికారం కాబట్టి ముంబై నుంచి వచ్చే ఆదాయాన్ని తీసుకునేది కేంద్రం. అయితే ఇప్పుడు అలా లేదు. పరిస్థితి మారిపోయి ఆదాయం మీద ప్రభావం పడింది. 

 

దీనితో హైదరాబాద్ మీద బిజెపి గురిపెట్టింది. కేంద్ర పాలిత ప్రాంతం చెయ్యాలని చూసింది. అందుకే తేడా వస్తే ప్రభుత్వం ఇబ్బంది పడే అవకాశం ఉందని కెసిఆర్ భావించారు. సరే అదీ కాకపోతే తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విపక్షాలను, ప్రాంతీయ పార్టీలను కెసిఆర్ ఏకతాటిపైకి తీసుకురావాలని కెసిఆర్ భావించారు. అప్పుడు రాష్ట్ర రాజకీయాల మీద పట్టు సడలుతుంది. దీనిని బిజెపి ఆసరాగా చేసుకునే అవకాశం ఉంది. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఇద్దరూ కాచుకుని కూర్చున్నారు. అందుకే ఇప్పుడు కెసిఆర్ చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కేటిఆర్ కి పట్టాభిషేకం ఇప్పట్లో వద్దని భావించి వెనక్కు తగ్గారు.

మరింత సమాచారం తెలుసుకోండి: