కేంద్రం వరుసగా జగన్ కు శుభవార్తలు చెబుతూ వస్తోంది. చాలా కాలంగా ఏపీలో ఇంటిలిజెన్స్ బాస్ గా స్టీఫెన్ రవీంద్ర ను నియమించేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే దీనికి కొన్ని నిబంధనలు అడ్డు రావడం, కేంద్రం అభ్యంతరం చెప్పడంతో జగన్ ఆశలు తీరడం లేదు. అయితే ఎట్టకేలకు స్టీఫెన్ రవీంద్రను ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్ గా నియమించుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం స్టీఫెన్ రవీంద్ర తెలంగాణ ఇంటిలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. ఎప్పటి నుంచో ఆయనను ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో స్టీఫెన్ రవీంద్ర రాజశేఖరరెడ్డికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పని చేశారు. అంతే కాకుండా రాయలసీమలో కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 


1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన నీతి నిజాయితీ గల పోలీస్ అధికారిగా ఏపీలో బాగా పేరు తెచ్చుకోవడంతో జగన్ ఆయనను ఇక్కడికి తీసుకు వచ్చేందుకు ఇంతగా కేంద్రాన్ని పట్టుబట్టారు. గతంలో ఎన్నో కేసులను స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో సమర్థవంతంగా ఛేదించడం, అలాగే గతేడాది తెలంగాణలో జరిగిన ఐటి గ్రిడ్ కి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు ఆయన నేతృత్వం వహించడంతో అనేక సార్లు స్టీఫెన్ రవీంద్ర ను ఏపీకి పంపించాలని జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను స్వయంగా కలిసి కోరారు. ఈ విషయంపై రాష్ట్ర అధికారులు కూడా కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించకుండా... ఆమోదించకుండా అప్పటి నుంచి పెండింగ్ లో పెడుతూనే వస్తోంది.


 ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర సంబంధాలు మెరుగవడంతో అన్ని విషయాల్లోనూ జగన్ నిర్ణయాలకు అండగా ఉంటానంటూ స్వయంగా ప్రధాని చెప్పడంతో ఇప్పుడు వైసిపి డిమాండ్లను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్ గా రవీంద్ర ను నియమించేందుకు కేంద్రం అనుమతించడంతో మరికొద్ది రోజుల్లోనే ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: