ఉన్నట్టుండి ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గతంలో రాజధాని అమరావతికి మద్దతుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ ఆ తరువాత స్వయంగా బిజెపి అగ్రనేతలు తాము మూడు రాజధానులు మద్దతు ఇస్తున్నామని, రాజధాని ఎక్కడ పెట్టుకుంటారో మీ ఇష్టం ఈ విషయంలో మేము జోక్యం చేసుకోము అంటూ జగన్ ను ఢిల్లీకి పిలిచి మరీ చెప్పడంతో ఏపీ బీజేపీ నేతలు సైలెంట్ అయ్యారు. వెంటనే యూటర్న్ తీసుకున్నారు. రాజధాని ఏర్పాటు అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అంటూ మద్దతుగా ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడారు. ఇప్పుడు మరోసారి వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. ఈరోజు కడప లో జనసేన బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా విమర్శలు చేశారు.


ప్రజా పోరాటాలు చేస్తున్న తమ పై అక్రమ కేసులు పెడుతున్నారని, ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై కేసులు పెడితే ఊరుకునేది లేదని, అవసరమైతే పోలీసులపై తిరగబడేందుకు కూడా తాము వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. గత టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు కూడా ఇదే విధంగా పోలీసులను అడ్డంపెట్టుకుని పరిపాలన చేశారని, ఇప్పుడు ఆ విధంగా వైసీపీ ప్రభుత్వం పోరాటం చేస్తోందంటూ ఆయన విమర్శలు చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు పథకాల్లో కోత పెడతామంటే చూస్తూ ఊరుకునేది లేదని, ప్రజల తరఫున తాము అండగా ఉండి పోరాడతామని చెప్పారు. అయితే కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


కేంద్రంలో బిజెపి ప్రభుత్వం జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉందని, సమర్ధుడైన నాయకుడుగా జగన్ పరిపాలన చేస్తున్నారని, జగన్ ఆధ్వర్యంలో ఏపీ మరింత అభివృద్ధి లో దూసుకు వెళ్తుంది అని వారు చెబుతుండగా ఏపీ బీజేపీ నేతలు మాత్రం ఈ విధంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు బిజెపి నాయకుల్లో ఒక స్పష్టమైన క్లారిటీ లేదని, ఎవరికి వారు తమకు ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది బీజేపీలో నెలకొన్న గందరగోళ రాజకీయాలకు నిదర్శనమని రాజకీయవిశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: