సాధార‌ణంగా కొన్ని సందర్భాలలో చిన్న చిన్న తప్పులే తీవ్రంగా మారి ప్రాణాల మీదకు తెస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. అయితే ఎలాంటి ప్రాణన‌ష్టం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. మధ్యప్రదేశ్ లోని చత్తర్ పూర్ జిల్లాలో ఆసక్తికర సంఘటన జరిగింది. ఓ మతిస్థిమితం లేని వ్యక్తి ఆసుపత్రిలో డాక్టర్ సీట్లో కూర్చుని రోగులకు మందులు రాయడం కలకలం రేపింది.  పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. అది ఓ ఆసుపత్రి. అందులోనే ఓ మెడికల్ షాపు ఉంది. ఓ రోజున షాపుకి కొందరు రోగులు వచ్చారు. డాక్టర్ రాసిచ్చిన చీటీని అక్కడున్న ఉద్యోగి చేతిలో పెట్టి.. మందులు ఇమ్మన్నారు.  

 

అతడు త‌న ద‌గ్గ‌ర ఉన్న‌ మందులు తీసి ఇస్తూ.. కౌంటర్ వద్ద ఉన్న వారితో సంభాషణ ప్రారంభించాడు. అప్పుడే అతడికి రోగులకున్న అనారోగ్య సమస్యల గురించి తెలిసింది. అయితేవారు చెప్పిన సమస్యలకు, మందుల చీటీలో డాక్టర్ రాసిన మందులకు అస్సలు పొంతన లేదు. రోగుల సమస్యలకు.. డాక్టర్ సూచించిన మందులకు అసలు ఏమాత్రం సంబంధం లేక‌పోవ‌డంతో అతడు ఒక్కసారిగా షాకయ్యాడు. మ‌రియు గతంలో ఎప్పుడూ ఇలా జరగకపోవడంతో అతడు అయోమయంలో పడిపోయాడు. దీంతో వెంట‌నే నేరుగా డాక్టర్ రూములోకి వెళ్లి దిగ్భ్రాంతికి గురయ్యాడు. అక్కడ డాక్టర్ కు బదులు మరో వ్యక్తిని చూసి నివ్వెరపోయాడు.

 

అస‌లు అక్కడ ఉన్న‌ది తనకు తెలిసిన డా. హిమాంషూ కాదు. అతడెవరో కూడా తెలియదు. వెంటనే ఈ విషయాన్ని ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బందికి చెప్పడంతో వారు అతడ్ని ప్రశ్నించడంతో అసలు విషయం వెల్లడైంది.  వాస్తవానికి అతను డాక్టర్ కాదు. అతడి మాటల ద్వారా మతిస్థిమితం లేని వ్యక్తి అని తెలుసుకున్నారు.  డాక్టర్ బయటకు వెళ్లగా చూసి మతిస్థిమితం లేని వ్యక్తి.. రంగంలోకి దిగాడని తెలిసి ఆసుపత్రి సిబ్బంది అవాక్కయ్యారు. అంతేకాకుండా తనను ఎయిమ్స్ వైద్యుడిగా చెప్పుకుంటూ, రోగుల బాధలు తీర్చడమే తన లక్ష్యమంటూ చెప్పడం  కొసమెరుపు. అయితే అప్పటికే అనేకమంది రోగులు అతడితో మందులు రాయించుకున్నారు. దీంతో జరిగిన విషయాన్ని రోగులకు చెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: