ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్ళలో భద్రత కరువైంది. జిల్లాలో మొత్తం 51 హాస్టళ్ళు ఉండగా.. ఐదారు మినహాయిస్తే ఎక్కడా విద్యార్థినులకు సరైన రక్షణ లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. వరుస లైంగిక వేధింపుల కేసుల నేపధ్యంలో , హాస్టళ్ళలోని అమ్మాయిలు భయం గుప్పిట్లోనే కాలం గడుపుతున్నారు.

 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంక్షేమ హాస్టళ్లతో పాటు గిరిజన, ఎస్సీ, ఎస్టీ, గురుకుల హాస్టల్స్ తో మొత్తం కలిపితే,  దాదాపు 51 అమ్మాయిల హాస్టల్స్ ఉన్నాయి. గురుకుల ,రెసిడెన్షియల్ హాస్టల్స్ వరకు బాగానే ఉన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ, గిరిజన వసతి గృహాల్లో అయితే మాత్రం నామమాత్రపు రక్షణ కూడా కరువైంది. కనీసం రాత్రి పూట వాచ్ మెన్ కానీ, అమ్మాయిల హాస్టల్ కాబట్టి సీసీ కెమెరాలు కూడా లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.    

 

మరో వైపు హాస్టల్స్ వద్ద పోకిరీల వేధింపులు కూడా ఎక్కువగా ఉన్నాయని అమ్మాయిలు మొత్తుకుంటున్నారు. తమకు మహిళా సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొన్న సిరిసిల్లలో.. లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడిపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు మంత్రి కేటీఆర్. ఎవరూ భయపడొద్దని అభయం ఇచ్చారు.  

 

మరో వైపు అమ్మాయిల హాస్టల్స్ లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు.ఆపద సమయంలో ఆత్మరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుపుతూ ట్రైనింగ్ ఇస్తున్నారు. పోలీసులు అవగాహన కల్పించడంతో పాటు పెట్రోలింగ్, షీ టీమ్స్ ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుతున్నారు అమ్మాయిలు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న హాస్టల్స్ సంగతి పక్కన పెడితే,  కరీంనగర్ నడిబొడ్డున ఉన్న హాస్టల్స్ లో కూడా సరైన రక్షణ లేదు. దీంతో నిరంతరం అమ్మాయిల హాస్టల్స్ కి సెక్యూరిటీ ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు మరికొందరు స్టూడెంట్స్. తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే,  తమకు చదువుకోవాలన్న శ్రద్ధ కూడా తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అమ్మాయిల హస్టళ్ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు విద్యార్ధినులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: