ఉగాది పండుగ నాటికి సిద్దమవుతున్న 25 లక్షల ఇళ్ళ పట్టాల్లో ఏమేమి  వివరాలుంటాయో తెలుసా ?  రాష్ట్ర చరిత్రలో బహుశా దేశంలోనే ఒకేసారి 25 లక్షల మంది పేదలకు ఇళ్ళ పట్టాలు అందివ్వటమన్నది ఇదే మొదటిసారేమో. ఇంతటి ప్రిస్టేజియస్ ప్రాజెక్టును ఉగాది సందర్భంగా మార్చి 25వ తేదీన జగన్మోహన్ రెడ్డి లాంచ్ చేయబోతున్నారు. అందుకనే ప్రధానమంత్రి నరేంద్రమోడిని ఆహ్వానించారు. సరే మోడి వచ్చినా రాకపోయినా పథకం అయితే లాంచ్ అయిపోవటం ఖాయం.

 

ఈ సందర్భంగా ప్రభుత్వం కొత్త తరహాలో ఇళ్ళ పట్టాల స్టాంప్ పేపర్ ను డిజైన్ చేయించింది. 10 రూపాయల విలువ గలిగిన స్టాంప్ పేపర్ అంతర్లీనంగా నవరత్నాల పథకాల వివరాలతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తో పాటు జగన్ ఫొటోలు కూడా ఉంటుంది. ఇళ్ళపట్టాల పంపిణీలోని కొత్త నిబంధన ఏమిటంటే ఐదేళ్ళ తర్వాత ఇంటిస్ధలాన్ని అమ్ముకోవచ్చు లేదా కొనుక్కోవచ్చు కూడా.

 

గతంలో అయితే ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే ఇటువంటి పట్టాలను అమ్ముకోవటం, కొనుక్కోవటం కుదిరేది కాదు. ఒకవేళ అమ్ముకోవాలంటే 12 ఏళ్ళ తర్వాత ఎంఆర్వో అనుమతి అవసరమయ్యేది. కానీ తాజాగా సవరించిన నిబంధనల్లో పట్టా సొంతదారుడికే అధికారాన్ని కట్టబెట్టేశారు. అలాగే అవసరమైతే ఎప్పుడైనా కుదవ పెట్టుకునే అధికారం కూడా ఇచ్చారు. అంటే దీని వల్ల ఎక్కువమంది కుదవపెట్టేసుకోవటమో లేకపోతే అమ్మేసుకోవటమో చేస్తారనటంలో సందేహం లేదు.

 

ఇచ్చే పట్టాలన కూడా లబ్దిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. గతంలో రిజిస్ట్రేషన్ అంటు ప్రత్యేకంగా ఉండేది కాదు. స్టాంప్ పేపర్ మొదటి పేజిలో ఎంఆర్వో సంతకంతో పాటు లబ్దిదారుడి సంతకం లేదా వేలిముద్ర ఉంటుంది. రెండోపేజిలో ఇంటి పట్టా ఏ ప్రాంతంలో ఇచ్చారు ? దాని సరిహద్దతులేమిటి ? అనే వివరాలుంటాయి. మూడో పేజిలో మళ్ళీ ఎంఆర్వో, లబ్దిదారుడి సంతకాలతో పాటు బినిఫిషియరీ ఫొటో, అడ్రస్ కూడా ఉంటుంది. పట్టాలను రిజిస్టర్ చేసే అధికారం ప్రభుత్వం తాత్కాలికంగా ఎంఆర్వోలకు అప్పగించింది. కాబట్టి లబ్దిదారులకు పట్టాల విషయంలో అనుమానం అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: