తూర్పు గోదావరి జిల్లాలో పేదలకు ఇచ్చే బియ్యం కార్డుల పంపిణీలో జాప్యం జరుగుతుంది. సగం కార్డులే అందుబాటులోకి రావడంతో, కార్డులు పంపిణీ నత్తనడకన సాగుతుంది. ఏప్రిల్  నుండి కొత్త కార్డులపై బియ్యం సరఫరా చేయనున్న తరుణంలో లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది.  

 

తూర్పుగోదావరి జిల్లాలో బియ్యం కార్డుల పంపిణీ కార్యక్రమం మొల్లగా సాగుతోంది. దాంతో కార్డుదారుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే చాలామంది పింఛన్‌దారులను అనర్హులుగా ప్రకటించడంతో వారింకా కోలుకోలేదు. పరిశీలనలో ఉన్నవారికి కూడా కార్డులు ఇనాక్టివ్‌లో ఉండటంతో సరకులు రావడం లేదు. అర్హులైన చాలామంది ఆయా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కార్డులను యాక్టివ్‌ చేయాలని కోరుతున్నారు.

 

కార్డుల పంపిణీలో ఆలస్యంవల్ల అర్హులైన కార్డుదారులకు కూడా వస్తుందా..రాదా అని ఆందోళన చెందుతున్నారు. కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమై వారం రోజులు గడిచినా నిర్థేశిత లక్ష్యాన్ని అధికారులు చేరుకోలేదు.నెలాఖరు నేపథ్యంలో రేషన్‌ తీసుకునే సమయానికి కార్డులు ఇస్తారా లేదా అని కొందరు ఆందోళన చెందుతున్నారు. 

 

నాలుగు చక్రాల వాహనం ఉన్న వారు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, 300 యూనిట్లు కంటే ఎక్కువగా విద్యుత్‌ వినియోగించేవారు, మూడెకరాలకు పైబడి పదెకరాల వరకూ మెట్ట భూమి ఉన్నవారు, వెయ్యి చదరపు అడుగుల స్థలంలో సొంత ఇల్లు ఉన్నవారు బియ్యం కార్డులు పొందేందుకు అనర్హులు.   

 

ఈనెల 15నుంచి బియ్యం కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. రోజుకు లక్ష కార్డులు పంపిణీ చేయాలి. ఆ లెక్కలో ఇప్పటికి ఏడు లక్షల కార్డుల పంపిణీ జరగాలి. కానీ ఇప్పటికి జిల్లాకు  3 లక్షల 50 వేల కార్డులు మాత్రమే చేరాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించిన కార్డులన్నీ ఒకే కాంట్రాక్టర్‌ ముద్రిస్తున్నారని సమాచారం. దీనివల్ల కార్డుల పంపిణీ అరకొరగా సాగుతోంది. ప్రతిరోజూ ముద్రణ చేసే ప్రదేశం నుంచి జిల్లా పౌరసరఫరాల కార్యాలయానికి కార్డులు వస్తున్నాయి. అక్కడినుంచి కార్డులను ఆయా మండలాలకు సరఫరా చేస్తున్నారు.

 

ప్రస్తుతం జిల్లాకు కొత్తగా ముద్రించిన కార్డులు 3లక్షల వరకూ జిల్లాకు చేరాయి.అక్కడి నుంచి మండలాలకు వాటిని చేరవేశారు. కొన్నిగ్రామాలకు వచ్చిన కార్డుల్లో కూడా తప్పులు ఉండటంతో వాటిని కూడా తిరిగి జిల్లా కేంద్రానికి పంపించి వేస్తున్నారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న అందరికీ కార్డులు పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. అనర్హులుగా గుర్తించిన కార్డుదారులు సచివాలయాల్లో తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే,  వాటిని పరిశీలించి అర్హత మేరకు కొత్తవి పంపిణీ చేస్తామన్నారు పౌర సరఫరాల శాఖ అధికారులు. 
బియ్యం కార్డులు పంపిణీ త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అధికారులు సైతం నెలాఖరులోపు కార్డుల పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తామని భరోసా ఇస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: