కృష్ణాజిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ చర్యలకు గండి కొడుతూ .ఏకంగా వాగులోనే రోడ్డు నిర్మించి ఇసుకను దోచుకుంటున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో...వాళ్ల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. 

 

కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతంలో ఇసుక వ్యాపారులు పేట్రేగిపోతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకూడదని పటిష్టమైన పాలసీని తీసుకువచ్చినప్పటికీ....నిబంధనలు పట్టించుకోవడం లేదు.  చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామం లో పది ఎకరాల పట్టా భూమి నుండి ఇసుక తరలింపు కోసం అనుమతులు తీసుకున్న ఇసుక వ్యాపారులు భారీ స్థాయిలో అక్రమాలకు తెర తీశారు. ఏకంగా మునేటి వాగును రెండు భాగాలుగా విడదీస్తూ రోడ్డు నిర్మించారు.  చింతలపాడు నుండి కంచికచర్ల మండలం ఎస్ అమరవరంవరకు సుమారు రెండు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరిగింది. నీటిలో సిమెంటు తూములను ఏర్పాటుచేసి వాటిపై గా రహదారి నిర్మాణం జరిగిందంటే ఇసుక తరలింపు ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.


చందర్లపాడు మీదుగా వెళ్లాలంటే 40 కిలో మీటర్ల దూరం రావటంతోపాటు బెజవాడ వైపు రావాలంటే కీసర టోల్ గేటును దాటాల్సి ఉంటోంది. అయితే మునేరు అక్రమంగా వేసిన రోడ్డు ద్వారా నేరుగా ఇసుక లోడింగ్ ప్రాంతానికి పది కిలోమీటర్లు మాత్రమే రావటంతో ఈ రోడ్డును వినియోగిస్తున్నారు వ్యాపారులు. నిబంధనలకు విరుద్ధంగా మునేటి వాగులో వేసిన ఈ రోడ్డుపై అధికార యంత్రాంగం కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎలాంటి అనుమతులు లేకుండానే రోడ్డును ఏర్పాటు చేశారని చెబుతున్న నీటిపారుదల శాఖ అధికారులు అక్కడకు వెళ్ళి హడావిడి చేయటమే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

 

మునేటి వాగు మీద వేసిన రోడ్డు ద్వారా ఇసుక నింపుకున్న లారీలు టోల్ గేటు తగలకుండా నేరుగా కంచికచర్ల బైపాస్ చేరుకుంటున్నాయి. అక్కడ నుంచి నగరంలోకి వెళ్తుండటంతో అనుమతి పత్రాలు ఉన్నాయా లేదా ఓవర్ లోడా కాదా అనేది పట్టుకోవటం కష్టంగా మారుతోంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోతే....గత ప్రభుత్వం మాదిరిగా....జగన్ సర్కారు కూడా ఇసుక విషయంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: