హైద‌రాబాద్ న‌గ‌రంలో అడుక్కునే ప్ర‌క్రియ‌కు చెక్ పెట్టేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం యాచకులకు పునరావాసం కల్పించడం ద్వారా యాచకవృత్తి లేకుండా చేసే లక్ష్యంతో జాతీయస్థాయిలో ప్రచారోద్యమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా యాచకుల రహిత నగరాలుగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్‌ సహా మరో పది నగరాలను పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపికచేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ కార్యదర్శి   ఎన్‌జీఓలు, పోలీసుశాఖ, జీహెచ్‌ఎంసీకి చెందిన అధికారులతో నగరంలో ఓ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. 

 

కేంద్రం ఆదేశాల నేప‌థ్యంలో యాచక రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఓ కార్యప్రణాళికను రూపొందించాలని నిర్ణయించారు. యాచకులకు సుస్థిర పునరావాసం కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. పోలీసులు, ఎన్జీవోల సహకారంతో సర్వే నిర్వహించి యాచకులను గుర్తిస్తారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి చికిత్స అందిస్తారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న యాచకులకు సమీపంలోని ప్రాథమిక వైద్యశాలలు, ఏరియా దవాఖానలు, రెఫరెల్‌ దవాఖానల ద్వారా వైద్య సౌకర్యం క‌ల్పిస్తారు.  యాచకుల అర్హతల ఆధారంగా నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తారు.  వారి అవసరాలకు తగ్గట్టు కెరీర్‌ కౌన్సెలింగ్‌, వృత్తినైపుణ్య శిక్షణ, బ్రిడ్జి కోర్సుల్లో ప్రవేశం, అర్హతలకు అనుగుణంగా ప్రభుత్వ పథకాలు వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటారు. మానసిక రోగులు, వ్యాధులతో బాధపడుతున్నవారికోసం జోన్‌కి ఒకటి చొప్పున ట్రాన్సిట్‌ హోమ్‌ల ఏర్పాటు. ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు చేయ‌నున్నారు. 

 

ఈ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేసేందుకు సర్కిళ్ల వారీగా వివిధ శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేస్తున్నది. స్థానిక కార్పొరేటర్‌లు, పోలీసు, సివిల్‌, ట్రాఫిక్‌, షీ బృందాల ప్రతినిధులు, రెవెన్యూ, పౌరసరఫరాలు, ఐసీడీఎస్‌, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, ప్రాథమిక, ఉన్నత, బస్తీ దవాఖానలు, ఏరియా దవాఖానలు, సాంఘిక సంక్షేమం, కార్మిక సంక్షేమం, స్థానిక ఎన్‌జీఓలు, నివాస, కాలనీ సంక్షేమ సంఘాలు, ఇతర సంక్షేమ సంఘాల ప్రతినిధులు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉంటారు. ఈ నెలాఖరులోగా కార్యప్రణాళిక అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్  ఉత్తర్వులు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: