ఒక్కోసారి అభిమానం సైతం అవాక్క‌యేలా చేస్తుంది. అన‌వ‌స‌రంగా చిక్కుల్లో ప‌డేలా చేస్తుంది. తాజాగా అదే జ‌రిగింది. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ విష‌యంలో కొంద‌రు నేత‌ల అత్యుత్సాహం వారికి ఊహించ‌ని షాక్ ఇచ్చింది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పలు పట్టణాల్లో విస్తృతంగా పర్యటించి.. అక్కడ నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమం యొక్క అవగాహన సదస్సుల్లో పాల్గొనే షెడ్యూల్ పెట్టుకున్నారు. అయితే, ఈ టూర్లో ఏకంగా మున్సిప‌ల్ చైర్మ‌న్‌కే ఫైన్ ప‌డింది.

 

 

భద్రాద్రి కొత్తగూడెంలోని ఇల్లందు మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ ఇవాళ పర్యటించారు. అక్కడ విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించిన ఇల్లెందు మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వేంకటేశ్వర్లకు మంత్రి కేటీఆర్‌ లక్ష రూపాయల జరిమానా విధించారు. జరిమానాను సదరు వ్యక్తి నుంచి వెంటనే వసూలు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఫ్లెక్సీలకు పెట్టే ఖర్చు.. మున్సిపల్‌ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తే బాగుంటుందని మంత్రి కేటీఆర్‌ హితవు పలికారు. రాష్ట్రప్రభుత్వం పల్లె, పట్టణ అభివృద్ధిపై అత్యంత ప్రాధాన్యత కనబరుస్తోందనీ.. ఇలా ఫ్లెక్సీలు పెట్టుకుంటూ పోతే రేపటి నాటికి.. వాటిని పట్టించుకునే నాథులు లేక చెత్తాచెదారంగా తయారవుతాయని మంత్రి అన్నారు.

 


రాబోయే నాలుగేళ్లలో ఎలాంటి ఎన్నికలు లేవు. ప్రచార ఆర్భాటాలు, ఓటర్లను ఆకట్టుకోవడానికి జిమ్మిక్కులు చేయాల్సిన అవసరం లేదనీ.. రాష్ట్ర అభివృద్ధి పైనే ప్రభుత్వం దృష్టి సారించిందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ‘పల్లెప్రగతి’ కార్యాక్రమం విజయవంతమవడంతో.. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ‘పట్టణప్రగతి’ కార్యక్రమాన్ని చేపట్టారనీ, తద్వారా పట్టణాలను అభివృద్ధి చేసుకునేందుకు వీలుంటుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రభుత్వం.. నిత్యం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపైనే దృష్టి సారిస్తున్నదని మంత్రి తెలిపారు. ప్రజా ప్రతినిధులంతా ప్రతి పల్లె, పట్టణాల్లో తిరుగుతూ.. పనులను పర్యవేక్షిస్తున్నారని మంత్రి తెలియజేశారు.పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి వార్డులో విరివిగా మొక్కలు నాటి, సంరక్షించాన్నారు. డ్రైనేజీ వ్యవస్థ, మురికి కాల్వలు శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి ప్రజలకు సూచించారు. ఇంట్లోని చెత్తను రోడ్లపై వేయకుండా.. మున్సిపల్‌ సిబ్బందికి అందజేయాలని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న చెత్తబుట్టలను వాడుకోవాలన్నారు. తడి, పొడి చెత్తలను వేరు చేసి.. శానిటేషన్‌ సిబ్బందికి అందించాలని మంత్రి వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: