తిరుమలలో శ్రీవారి బూంది పోటుని ఆధునికీకరించేందుకు టీటీడీ ప్రయత్నాలు చేస్తోంది. పోటులో థర్మో లిక్విడ్ స్టౌవ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది పాలకమండలి. మెదటి దశలో ఇరవై థర్మో లిక్విడ్ స్టౌవ్‌లు అందుబాటులోకి వస్తాయి. బూందీపోటులో అగ్ని ప్రమాదాలు పూర్తిగా నివారించేందుకు టీటీడీ శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది.

 

అఖిలాండకోటి బ్రహ్మండనాయకుడైన శ్రీవారి దర్శనార్థం నిత్యం 70 వేల నుంచి లక్ష మంది భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు. శ్రీవారి దర్శనం తరువాత భక్తులు అధిక ప్రాధాన్యత ఇచ్చేది లడ్డూ ప్రసాదానికే. అందుకే దేశంలో మరే పుణ్యక్షేత్రంలోని ప్రసాదాలకు లేనంత డిమాండ్ స్వామివారి లడ్డూ ప్రసాదానికి ఉంది. లడ్డూ ప్రసాదాల విక్రయాలు రోజూ 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుంది. శ్రీవారి ఆలయంలో ఉన్న పోటులో స్థల ప్రభావం దృష్ట్యా రోజుకు లక్ష నుంచి లక్షా ముప్ఫై వేల లడ్డూలు మాత్రమే తయారు చేసే అవకాశం ఉండేది. భక్తులకు సరిపడినన్ని లడ్డూలు తయారు చేసేందుకు 2007లో బూంది పోటును ఆలయం వెలుపలికి తరలించింది టిటిడి. అక్కడే బూందిని తయారు చేసేవారు. దానిని శ్రీవారి ఆలయంలోకి తరలించి లడ్డూ ప్రసాదంగా తయారు చేస్తుండేవారు. నిత్యం 3.25 లక్షల నుంచి 4 లక్షల లడ్డూలను తయారు చేస్తుండేవారు. భక్తులకు సరిపడినన్ని లడ్డూలు విక్రయించేది టీటీడీ. 

 

శ్రీవారి ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన బూంది పోటులో నిరంతరాయంగా బూంది తయారవుతుంది. పోటులో మూడు వరుసలలో 40 స్టౌవ్‌లును ఏర్పాటు చేశారు. షిప్టుకి 40 మంది చొప్పున మూడు షిప్టుల్లో విధుల్లో ఉంటారు పోటు కార్మికులు. నిరంతరాయంగా బూందిని తయారు చేస్తుంటారు. బూంది తయారీకి నెయ్యిని వాడుతుంటారు. ఇక...ఆవిరిగా మారిన నెయ్యి పైప్రాంతంలో ఉన్న చిమ్నీ వద్ద నిల్వలుగా పేరుకుపోతుంటుంది. దీంతో స్టౌవుల నుంచి మంటలు ఎగిసిపడుతుంటాయి. ఆ సమయంలో చిమ్నీ వద్ద నిల్వలుగా పేరుకుపోయిన నెయ్యికి అంటుకుంటాయి. ఫలితంగా మంటల తీవ్రత పెరుగుతుండేది. ఇలా బూందీ పోటులో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల నివారణకు గతంలో కమిటిని నియమించింది టిటిడి. ఆ కమిటీ నిర్ణయం మేరకు ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజున పోటులో బూంది తయారీని నిలిపివేస్తారు. పూర్తి స్థాయిలో పోటును శుభ్రం చేస్తారు. ప్రస్తుతం ఉన్న స్టౌవ్‌ల స్థానంలో వేడిని మాత్రమే ఇచ్చే థర్మో లిక్విడ్ స్టౌవ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది టీటీడీ. ప్రయోగాత్మకంగా రెండు స్టౌవ్‌లను కూడా ఏర్పాటు చేసింది. 

 

అయితే.. గతంలో టీటీడీ తీసుకున్న నివారణ చర్యలతో కొంతమేర ప్రమాదాలు తగ్గిపోయాయి. గత ఏడాది డిసెంబర్‌లో మరోసారి బూంది పోటులో అగ్ని ప్రమాదం జరిగింది. ఇది టీటీడీ అధికారులును మరింత ఆందోళనకు గురి చేసింది. ప్రమాదం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం లేనప్పటికీ...ప్రమాదాలు భక్తుల మనోభావాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు ప్రారంభించింది టీటీడీ. అందులో భాగంగానే ప్రతి నిత్యం కూడా పోటులో శుభ్రపర్చే కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. నెయ్యిని బాండిలోకి పోస్తున్న సమయంలో అవి జారిపడి స్టౌ నుంచి వస్తున్న మంటలకు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అందుకే ఇకపై బర్నర్‌ని ఆఫ్ చేసి నెయ్యిని బాండిలోకి పోయాల్సి ఉంటుంది.ఇక మంటలు వెలువడే స్టౌవ్‌ల స్థానంలో...వేడిని మాత్రమే ఇచ్చే థర్మో లిక్విడ్ స్టౌవ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది టీటీడీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: