చంద్రబాబు నిత్యరాజకీయవాది. ఆయన ప్రతీ రోజూ ఎక్కడో ఒకచోటకు యాత్రల  పేరిట తిరగకపోతే పొద్దుపోదు. అలాంటి బాబు విశాఖలో గో బ్యాక్ ఎపిసోడ్ తరువాత ఎందుకో తగ్గారు. ఆయన గత వారంగా జనాల్లోకి రావడంలేదు. నిన్నటివరకూ ప్రెస్ కి కూడా దూరంగా  ఉన్నారు. బాబులో ఒక్కసరిగా ఈ నైరాశ్యం ఎందుకో అన్న చర్చ పచ్చపార్టీలో నడుస్తోంది.

 


నిజానికి  బాబు విశాఖ రావాలనుకున్నారు. స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా ఆయన ఓ వైపు పార్టీ నాయకుల ఇళ్ళలో పెళ్ళిళ్ళు, మరో వైపు చైతన్య యాత్రలు కలిపి చేస్తే పని పూర్తవుతుందనుకున్నారు. అనూహ్యంగా వైసీపీ రెచ్చగొట్టుడు ప్రతివ్యూహంతో కధ అడ్డం తిరిగింది. దాంతో బాబుకు అప్పనంగా కొంత సానుభూతి కూడా వచ్చింది. ప్రస్తుతం దాన్ని నిలబెట్టుకునే పనిలో భాగంగానే రోడ్డెక్కడలేదా అన్న డౌట్లు వస్తున్నాయి.

 

నిజానికి బాబు గత తొమ్మిది నెలలుగా కాలుగాలిన పిల్లిలా ఏపీలోని ప్రతి జిల్లాలో  తిరుగుతున్నారు. ఓడిపోయిన తరువాత నుంచి క్షణం కూడా రెస్ట్ తీసుకోకుండా పార్టీని పట్టాలెక్కించే పనిలో పడ్డారు. అయితే బాబు ఎన్ని ఆందోళనలు  చేసినా చలో ఆత్మకూర్ అన్నా, ఇసుక సత్యాగ్రహాలు చేసినా కూడా ఫలితం పెద్దగా లేకపోయింది.  జనాలలో రెస్పాన్స్ కరవైంది. అయితే వాటన్నిటినీ కలుపుకుని ఒక్కసారిగా విశాఖ గో బ్యాక్ ఎపిసోడ్ ఎక్కడలేని సింపతీని తెచ్చిపెట్టిందని టీడీపీ నేతలు  గట్టిగా నమ్ముతున్నారు. 

 

బాబు వంటి సీనియర్ నాయకుడిని వెనక్కు పంపడం ద్వారా వైసీపీ నేతలు ఏదో సాధించినట్లుగా  సంబరం చేసుకుంటున్నారని కానీ అది వారికి బూమరాంగ్ అయిందని కూడా పసుపు పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు తన సానుభూతి అస్త్రాన్నే పదుపు పెట్టేందుకు ఇలా చేస్తున్నారని  అంటున్నారు.

 


ఇంకోవైపు చూసుకుంటే చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యాయని కూడా ప్రచారం సాగుతోంది. చంద్రబాబు ఎన్నికలలో ఓడిన తరువాత అప్పట్లో అమెరికా వెళ్ళి గట్టిగానే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆ తరువాత ఆయన చలాకీగానే కనిపించారు. అయితే రెస్ట్ తీసుకోమని డాక్టర్లు బాబుకు చెప్పినా ఆయన రాజకీయ అనివార్యతలు  కారణంగా రోడ్డెక్కక‌తప్పలేదు. ఇలా విసుగూ  విరామం లేకుండా గత తొమ్మిది నెలలూ ఆయన పనిచేయడం వల్లనే  ఇపుడు మళ్ళీ ఆరోగ్య‌  సమస్యలు వచ్చాయని అంటున్నారు. ఈ కారణంగానే  కాస్తా వెనక్కు తగ్గారని  చెబుతున్నారు.

 


బాబు ఆశలన్నీ ఇపుడు లోకల్ బాడీ ఎన్నికల మీదనే ఉన్నాయి. ఎన్ని రకాల పర్యటనలు చేసినా కూడా అసలైన ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ళ పైదాటి సమయం ఉంది. అందుకే లోకల్ ఫైట్ లో పై చేయిగా నిలిస్తే నైతిక స్థైర్యం పెంపొందడంతో పాటు, పార్టీ క్యాడర్ కూడా పక్కనే ఉంటారని, రానున్న రోజుల్లో పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న ధీమా కూడా కలుగుతుందని బాబు భావిస్తున్నారు.

 

లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ వస్తే తప్ప బాబు గుమ్మం కదలరని అపుడే ఆయన అమీ తుమీ తేల్చుకుంటారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి బాబు మాట్లాడినా రాజకీయమే, రోడ్డెక్కకపోయినా  కూడా రాజకీయమే. దాంతో ఆయన ఏ రకమైన కొత్త ప్లాన్ వేస్తున్నారో అర్ధం కాక అధికార పక్షమూ ఆ వైపుగా చూస్తోందట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: