బాబాయిలకు అబ్బాయిలే షాక్ ఇస్తే అది మామూలే. అమ్మాయిలు షాకి ఇస్తే ఆ కిక్కే వేరుగా  ఉంటుంది. అందులోనూ మహిళా దినోత్సవం నాలుగు రోజుల్లో ఉందన‌గా ఆకాశంలో సగమైన అమ్మాయిలు అవకాశాల్లోనూ మేమే ముందు అంటున్నారు. మరి ఆ అమ్మాయి ఇచ్చిన షాక్ కి బాబాయ్ పరిస్థితి ఏంటో కదా

 

ఇదంతా ఒక అమ్మాయి గురించి చెప్పుకోవాలి. ఆ అమ్మాయి పుట్టినపుడు యువరాణి. ఆమె తల్లీ తండ్రీ ఇద్దరూ రాజకీయ ఘనాపాఠీలే. తండ్రి ఆనందగజపతిరాజు. పూసపాటి వారి వంశాంకురం. ఆయన నిజంగా మంచి మనసుకు పెట్టింది పేరు. ఆయన సతీమణిగా ఉమా గజపతి రాజు వచ్చారు. ఆమె కూడా విశాఖ ఎంపీగా పనిచేశారు.

 

వారికి పుట్టిన అమ్మాయే సంచయిత గజపతిరాజు. ఆమె తన తండ్రి బాటలోనే రాజకీయాల్లో సేవ చేస్తూ ఇప్పటికే ఉత్తమ ఎన్జీవోగా పేరు తెచ్చుకున్నారు. ఆమె బీజేపీలో గత ఎన్నికల ముందు చేరారు. పూసపాటి వారి సంస్థానం విజయనగరం  నుంచి పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ ఎందుకో వీలుపడలేదు.

 

ఇవన్నీ ఇలా ఉంటే ఆమె హఠాత్తుగా వైసీపీ సర్కార్ని బలపరుస్తూ వచ్చారు. మూడు రాజధానులకు జై కొట్టేసారు. అదే టైంలో బాబాయ్ అశోక్ గజపతిరాజు అమరావతి ఒక్కటే రాజధాని అంటున్నారు. ఇదిలా ఉండగానే ఆమె  సుప్రసిధ్ధ‌ పుణ్యక్షేతం శ్రీ సింహాచల వరహా నరసింహ స్వామి వారి ఆలయ చైర్ పర్సన్ గా వైసీపీ సర్కార్ ఈ రోజు  నియ‌మించింది.

 

ఇది అనూహ్య పరిణామం. హఠాత్తుగా జరిగిన పరిణామం. ఇప్పటివరకూ పీవీజీ రాజు, ఆనందగజపతిరాజు, అశోక్ గజపతిరాజు మాత్రమే ఈ ఘనమైన  పదవిని నిర్వహించారు. ఇపుడు ఆ వంశాంకురంగా సంచయిత హక్కుతో పాటు రాజకీయ అధికారం మద్దతుతో కుర్చీలో కూర్చుంటున్నారు

 

ఇది బాబాయ్ కి గట్టి దెబ్బగానే చూడాలి. అశోక్ పూసపాటి వంశంలో ఇపుడు పెద్దవాడు. ఆయన హయాం తరువాత కుమార్తె అదితి గజపతి రాజుని రాజకీయ వారసత్వంగా తీసుకురావాలనుకుంటున్నారు. ఇంతలో అన్న గారి కూతురు ఇలా వచ్చి అలా  రాజు గారి కోటలో పాగా వేయడం అంటే నిజంగా తట్టుకోలేని విషయం.

 

దీని వెనక వైసీపీ సర్కార్ స్కెచ్ గట్టిగానే ఉంది. వేలాది ఎకరాల భూములు కలిగిన ఆలయం, మాన్సాస్ ట్రస్ట్ నిర్వహణ తమకు అనుకూలంగా ఉండే రాచబిడ్డ సంచయిత చేతుల్లో పెట్టడం అంటే ఇది వైసీపీకి ఓ విధంగా సువర్ణ అవకాశం. మరో విధంగా అశోక్ కి టీడీపీకి పెద్ద దెబ్బ.

మరింత సమాచారం తెలుసుకోండి: