స్ధానిక సంస్ధల ఎన్నికల ఫలితాలు ఇపుడు మంత్రుల మెడకు చుట్టుకుంటోందా ? తాజాగా జగన్మోహన్ రెడ్డి చేసిన హెచ్చరికలను చూస్తుంటే వ్యవహారం అలాగే ఉంది. బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశం సందర్భంగా మంత్రులందరికీ జగన్ గట్టి హెచ్చరికలే జారీ చేశాడని మీడియాలో వచ్చింది.  స్ధానిక సంస్ధల ఎన్నికల్లో 90 శాతం ఫలితాలు గనుక వైసిపికి అనుకూలంగా రాకపోతే మంత్రులు వెంటనే రాజీనామాలు చేసేయాల్సిందే అంటు చేసిన హెచ్చరికలు సంచలనంగా మారింది.

 

అభ్యర్ధుల ఎంపికలోనే 75 శాతం గెలుపు ఆధారపడుంటుందని జగన్ స్పష్టంగా చెప్పాడు. ఎక్కడైనా తేడా వస్తే మంత్రులు రాజీనామాలు తీసుకుని నేరుగా రాజ్ భవన్ వెళ్ళి అక్కడే ఇచ్చేయాలని స్పష్టంగా చెప్పాడని పచ్చమీడియా ప్రముఖంగా చెప్పింది. అలాగే అభ్యర్ధుల ఓటమికి స్ధానిక ఎంఎల్ఏలు కూడా బాధ్యత వహించాల్సుంటుందని కూడా జగన్ వార్నింగ్ ఇచ్చాడంటున్నాయి. అభ్యర్ధుల ఎంపిక నుండి ప్రచారం, ఎన్నికల నిర్వహణ, పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మంత్రులు, ఎంఎల్ఏల ఆధ్వర్యంలోనే జరగాలని స్పష్టంగా చెప్పాడు.

 

క్యాబినెట్ సమావేశంలోనే జగన్ వార్నింగులు ఇవ్వటంతో  మంత్రులందరిలో టెన్షన్ పెరిగిపోయింది. జగన్ ఉద్దేశ్యం ప్రకారం గడచిన తొమ్మిది నెలల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, లబ్దిదారుల సంతృప్తాస్ధాయి తదితరాలను దృష్టి పెట్టుకుంటే లబ్దిదారులందరూ వైసిపికి తప్ప ఇతర పార్టీలకు ఓట్లేయకూడదన్నది జగన్ అభిప్రాయంగా కనిపిస్తోంది. లబ్దిదారులు ప్రభుత్వం విషయంలో సానుకూలంగా ఉన్నా అధికారపార్టీ అభ్యర్ధులు ఓడిపోయారంటే ఎలక్షనీరింగ్ లో లోపాల వల్లే అన్నది జగన్ లాజిక్.

 

ఇదే విషయాన్ని జగన్ మంత్రులకు స్పష్టంగా హెచ్చరికలు జారీ చేయటంతో ఏమి చేయాలో మంత్రులకు అర్ధం కావటం లేదు. కొందరు మంత్రులకు పార్టీ క్యాడర్ తో పాటు ఎంఎల్ఏలు, ఎంపి, నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయి. అదే పద్దతిలో కొందరికి ఫైట్ నడుస్తోంది. సరే సమస్యలు ఏదున్నా జగన్ అంతిమ ఫలితం ముందే చెప్పాశాడు కాబట్టి ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళుండాల్సిందే వేరే దారిలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: