రాజకీయ పార్టీల అధినేతల అభిప్రాయాలు ఎలా ఉన్నా... స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం గ్రామ స్థాయి నాయకులు తామే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి జరుగుతుండడంతో రాజకీయ పార్టీలన్నీఎత్తులు, పైఎత్తులు వేస్తూ తగిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జనసేన, బిజెపి కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే విజయవాడలో రెండు పార్టీల నేతలు సమావేశం నిర్వహించారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి..? ఎక్కడ ఎక్కడ బలం ఉంది ? అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నాల్లో ఉండగా.. ఇవేవి తమకు సంబంధం లేదన్నట్లుగా క్షేత్రస్థాయిలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి సర్దుబాట్లు చేసుకుంటున్నారు. 

IHG


ముఖ్యంగా జనసేన పార్టీ బలంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో నియోజకవర్గ స్థాయి టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు జనసేన నాయకులు. ముఖ్యంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో టిడిపి ఇంచార్జ్ దాట్ల బుచ్చి బాబు, జనసేన ఇంచార్జ్ పితాని బాలకృష్ణ కలిసి ఈ మేరకు ఒక అంగీకారానికి వచ్చారు. 13 ఎంపీటీసీలు, ఒక జెడ్పిటిసి స్థానాలు జనసేనకు ఇచ్చారు. అలాగే పి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం లోని మండల స్థాయిలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 


తూర్పుగోదావరి జిల్లాలో మరికొన్నిచోట్ల జనసేన నాయకులు టిడిపితో కలిసి సర్దుబాటు చేసుకుంటున్నట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ నాయకుల వ్యవహారాన్ని బట్టి చూస్తుంటే, బీజేపీతో కంటే      తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళితేనే ఫలితాలు ఆశాజనకంగా వస్తాయనే అభిప్రాయం కనిపిస్తోంది. అందుకే పార్టీ అధిష్టానం నిర్ణయం ఎలా ఉన్నా స్థానిక నాయకులు మాత్రం ఎవరికి వారు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ తమ పలుకుబడిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ 'స్థానిక'పొత్తులు ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: