జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ , మాజీ స్పీక‌ర్‌ నాదెండ్ల మనోహర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అప్రజాస్వామిక రీతిలో సాగుతున్నాయని ఆయ‌న ఆరోపించారు. నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసి దాడులకు పాల్పడి అడ్డుకుంటే అధికార యంత్రాంగం ఏమి చేస్తోందని  జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలో నామినేషన్ వేయడానికి వెళ్ళిన జనసేన పార్టీ అభ్యర్థి పత్రాలను పోలీస్ అధికారి చించి వేసినట్లు తెలిపారు. దాఖలైన నామినేషన్లను ఆర్ ఓ స్థాయి అధికారులు తిరస్కరిస్తున్నారని చెప్పారు. ఎన్నికల ప్రక్రియను ఒక మొక్కుబడి తంతుగా నడిపిస్తున్నారని నాదెండ్ల మనోహర్ తప్పుబట్టారు.

 

రాజమహేంద్రవరంలో శుక్రవారం నాదెండ్ల మనోహర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "పాలన వ్యవస్థలో కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలను సక్రమంగా నిర్వహించాల్సి ఉంది. అధికార యంత్రాంగం ఇందుకు సంబంధించిన బాధ్యతను విస్మరిస్తోంది. అధికార పార్టీ చేస్తున్న దౌర్జన్యాలను ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఈ ఎన్నికల ద్వారా స్థానిక సంస్థల పాలనలోకి యువతరాన్ని, మహిళలను తీసుకురావాలని బిజెపి-జనసేన పార్టీలు నిర్ణయించాయి అందుకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసి నామినేషన్లు దాఖలు చేయించిన సమయంలో ఉంటే అధికారపక్షం భయభ్రాంతులకు గురి చేస్తూ దాడులకు పాల్పడుతోంది. నామినేషన్ వేసిన అభ్యర్థులను పోలీసులు బైండోవర్ కేసులు పేరుతో స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. అదే విధంగా అభ్యర్థుల వెంబడి ఉన్న నాయకులను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. అయినప్పటికీ జనసేన - బీజేపీ కూటమి అభ్యర్థులు ధైర్యంగా ఉన్నారు. ధైర్యంగా నిలిచిన ప్రతి ఒక్కరికి పార్టీ అండగా నిలుస్తుంది.`` అని స్ప‌ష్టం చేశారు.

 

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గత ఐదేళ్లలో చేసిన తప్పులనే ఇప్పటి వైసీపీ ప్రభుత్వం చేస్తోందని మ‌నోహ‌ర్ ఆరోపించారు. ``జన్మభూమి కమిటీల పేరుతో ఒక వ్యవస్థను సృష్టించి టిడిపి చేసిన తప్పులను ఇప్పుడు వాలంటీర్ల పేరుతో వైసీపీ చేస్తోంది. ఈ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం అభివృద్ధిపై ఇలాంటి ప్రణాళిక లేదు కేంద్ర ప్రభుత్వం వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చే నిధులను కూడా తీసుకోవడం లేదు. ఇలాంటి విషయాలు ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ను కలిసినప్పుడు వెల్లడయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను వినియోగించి యూసీలు ఇవ్వడం లేదు. అదేవిధంగా చట్ట ప్రకారం రావాల్సిన నిధులను రాబట్టుకోవడం లేదు.`` అని మ‌నోహ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: