బ్యాంకులలో అతిపెద్ద బ్యాంకుగా పేరుపొందిన ఎస్‌బీఐ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎస్‌బీఐ ఖాతాదారులకు సంతృప్తి కర సేవలను అందిస్తూ ప్రత్యేక గుర్తింపును అందుకుంది. అంతే కాదు తన కస్టమర్ల కోసం డిపాజిట్లు, క్యాష్ విత్‌డ్రా, లోన్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇలా ఎన్నో సేవలను ఆఫర్ చేస్తోంది. అలాగే ఎస్‌బీఐ  తీసుకునే నిర్ణయాలు కూడా చాలా మంది ఆసక్తిగా తెలుసుకుంటారు, ఎలాంటి ఆఫర్లు ఇస్తుంది అలాగే వడ్డీ రేట్లు ఏం తగ్గించింది ఇలా అనేక విషయాలు తెలుసుకోవాలి అని కస్టమర్లు భావిస్తారు, దేశంలో అధిక శాతం మంది వినియోగించే బ్యాంకు కూడా ఇదే అన‌డంతో ఏ మాత్రం సందేహం లేదు.

 

ఇదిలా ఉంటే.. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాపై, ఎస్‌బీఐ చీఫ్ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్ర‌స్తుతం ఆ ఆడియో టేప్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఒక హృదయం లేని బ్యాంకు. మీ అసమర్ధతే బ్యాంకును ఇలా తయారుచేసింది అంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..  రుణవితరణ పెరగకపోవడానికి .. ముఖ్యంగా అస్సాం తేయాకు తోటల్లో పనిచేసే వారికి రుణాలు లభించకపోవడానికి ప్రధాన కారణం ఆయనేనంటూ నిర్మలా సీతారామన్‌ తీవ్ర పదజాలంతో తప్పుపట్టారు. 

 

ఒక్క మాటలో చెప్పాలంటే రజనీష్‌ కుమార్‌ను నిర్మలా సీతారామన్‌ ఘోరంగా అవమానించార‌ని ఆడీయో టేప్ బ‌ట్టీ అర్థం అవుతోంది. ఇక దీనికి సంబంధించి లీకైన  ఆడియో క్లిప్పింగ్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. గువాహటిలో గత నెల 27న నిర్వహించిన ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. నిర్మల వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటన విడుదల చేసిన ఆలిండియా బ్యాంకు అధికారుల సంఘం (ఏఐబీఓసీ).. తిరిగి దాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం. మ‌రోవైపు రజనీష్‌పై ఆర్థిక మంత్రి వ్యాఖ్యలను అఖిల భారత బ్యాంక్‌ ఆఫీసర్ల సమాఖ్య  ఖండించింది. ఎస్‌బీఐ ప్రతిష్టను దెబ్బతీసేందుకే గుర్తుతెలియని వారెవరో ఆడియో క్లిప్‌ను వైరల్‌ చేశారని, దీనిపై తక్షణం విచారణ జ‌ర‌పాల‌ని మండిప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: