ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు అమెరికా శాస్త్రజ్ఞులు మందు కనిపెట్టారా ? అవుననే అంటోంది మీడియా. అమెరికాలోని సియాటెల్ లో క్లినికల్ ట్రయల్స్ కూడా రెండు రోజుల్లో మొదలవ్వబోతోందట. ఇందుకోసమని అక్కడి ప్రభుత్వం 18-55 సంవత్సరాల మధ్య వయస్సున్న సుమారు 45 మందిని ఎంపిక చేసిందట. అంటే ముందుగా వీళ్ళపై తాము తయారు చేసిన మందును ప్రయోగించి ఫలితాలను ఎనలైజ్ చేస్తాయని సమాచారం. తామ కనిపెట్టిన మందుకు అమెరికా mRNA 1273 అని పేరు కూడా పెట్టింది.

 

మొత్తం మీద అమెరికా శాస్త్రజ్ఞులు ఎంతో కొంత పురోగతి అయితే సాధించారనే చెప్పాలి. ప్రపంచంలోని సుమారు 170 దేశాలు కరోనా వైరస్ భారినపడ్డాయి. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల కోట్ల రూపాయలు హారతి కర్పూరం అయిపోయింది. లక్షలది మంది జనాల ప్రాణాలు గాలిలో దీపంలాగ తయారైంది. ఇప్పటికి అధికారిక లెక్కల ప్రకారమే సుమారు 7500 మంది మరణించారు.

 

కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమైపోతున్నాయి. చాలా దేశాలు ఇతర దేశాలతో సంబంధాలు తెంచేసుకున్నాయి.  చాలా దేశాలు అధికారికంగానే విమానాశ్రయాలను షట్ డౌన్ చేసేశాయంటేనే పరిస్ధితి ఎంత దారుణంగా ఉందో అర్ధమైపోతోంది. చైనాలోని వుహాన్ ప్రావిన్స్ లో పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచదేశాలను వణికించేస్తోంది. చాలా దేశాల్లో ప్రజా జీవితం కూడా ఈ వైరస్ దెబ్బకు ప్యారలల్ అయిపోయిందనే చెప్పాలి.

 

ప్రపంచాన్నే వణికించేస్తున్న  ఈ వైరస్ కు ఇప్పటి వరకూ ఏ దేశం కూడా మందును కనుక్కోలేకపోయింది. అలాంటిది అమెరికా తాజాగా చేసిన ప్రకటనతో చాలా దేశాల్లో కాస్త హ్యాపీగా ఫీలవుతున్నారు. కాకపోతే ఇక్కడ సమస్య ఏమిటంటే ఇపుడే క్లినికల్ ట్రైయల్స్ మొదలవ్వబోతున్న ఈ మందును ఎంత కాలం పరీక్షిస్తారో తెలీదు. వాళ్ళ పరీక్షలు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంత కాలానికి అసలైన మందును తయారు చేస్తారో అమెరికా ప్రకటించలేదు. అదే సమయంలో జర్మనీలో కూడా క్యూర్ వ్యాక్స్ పేరుతో కరోనా వైరస్ కు విరుగుడుగా మందు తయారవుతోందని ప్రచారం జరుగుతోంది. మరి ఏ దేశం ఆ కరోనా మహమ్మారికి మందును తయారు చేస్తుందో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: