ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్​డౌన్ చాలా పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. నిత్యావసరాల ధరల విషయంలో దుకాణదారులు అధిక ధరలకు అమ్మితే ఖచ్చితంగా జైల్లోకి పంపించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి షాపు దగ్గర ప్రభుత్వం నిర్ణయించిన ధరలు బోర్డు చాలా పెద్ద సైజులో ఉండాలని వాటిని జిల్లా కలెక్టర్లు మరియు అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. అంతేకాకుండా రేషన్ మరియు రైతు బజార్ల దగ్గర సామాజిక దూరం పాటించేలా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మరియు కలెక్టర్లకు జగన్ ఆదేశించడం జరిగింది.

 

దీంతో రైతు బజార్ల దగ్గర నిత్యావసరాలు దుకాణాల దగ్గర ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా సామాజిక దూరం పాటించే విధంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే టైమింగ్స్ కుదింపు విషయంలో ఏపీ ప్రజలంతా కోపంగా ఉన్నారు. మొన్నటి వరకు ఉదయం 6 గంటల నుంచి ఒంటి గంట వరకు ఉన్న సమయాన్ని ఇటీవల ఉదయం 11 గంటల వరకు మాత్రమే కుదించడంతో ప్రజలంతా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై మండిపడుతున్నారు. జనం రద్దీ వల్ల అదేవిధంగా కొన్ని అవసరతలు వల్ల టైం సరిపోవడం లేదని, ఈ విషయంలో జగన్ సర్కార్ పునరాలోచించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

అంతేకాకుండా పోలీసులు ఎక్కడపడితే అక్కడ కారణం లేకుండా లాఠీలతో కొడుతున్నారని ప్రభుత్వం ఈ విషయంలో పోలీసులకు కొన్ని సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు. మరోపక్క గ్రామాల్లో ప్రజలకు ఉదయం 6 గంటల నుండి ఒంటిగంట వరకు టైం కుదించడంతో కొంత సానుకూలంగా ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఇటీవల ప్రభుత్వ అధికారులతో జగన్ సమావేశం అయిన సందర్భంలో అర్బన్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని దానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా ఎవరికైనా జ్వరం, పొడిదగ్గుతో కూడిన లక్షణాలు ఉంటే ఏ మాత్రం సందేహించకుండా 104, 1902 నెంబర్లకు ఫోన్‌ చేసి తెలిపే విధంగా అవగాహన కార్యక్రమం మీడియాలో బాగా చేయాలని జగన్ సూచించడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: