సీఎం పదవికి రాజీనామా చేసిన తరువాత సీమాంధ్రలో తనకు రాజకీయంగా బలం, బలగం ఎంతనేది అంచనా వేసుకునేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాథమిక కసరత్తు మొదలుపెట్టారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే తన వెంట నడిచే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామాను సమర్పించేందుకు కిరణ్ రాజ్‌భవన్‌కు వెళ్లిన సమయంలో కొద్దిమంది మంత్రులతోపాటు కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే రావటంతో ఆయన బలంపై సందేహాలు నెలకొన్నాయి. సీమాంధ్రలో ప్రస్తుతం కాంగ్రెస్ బలం 98మంది ఎమ్మెల్యేలు కాగా, అందులో నాలుగోవంతు మాత్రమే కిరణ్‌కుమార్‌రెడ్డి వెంట నడవడం ఆయనను కొంత నిరాశకు గురి చేసినట్టు తెలిసింది. ఎంపీలు, ఎమ్మెల్యేల్లో సగం మంది కలిసి వస్తే సొంత పార్టీ ఏర్పాటుకు కిరణ్ సన్నాహాలు చేస్తారని, లేనిపక్షంలో పరిస్థితులను అంచనా వేసుకుని తగిన కార్యాచరణను రూపొందించుకుంటారని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 22న మరో సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. కిరణ్ సొంత కుంపటి వ్యవహారాని ముందుగానే పసిగట్టిన కాంగ్రెస్ హైకమాండ్, ఆయనవెంట ఎక్కువమంది ప్రజాప్రతినిధులు వెళ్లకుండా కట్టడి చేసే పనిని ఇప్పటికే మొదలుపెట్టినట్లు తెలుస్తున్నది. అధిష్టానానికి విశ్వాసపాత్రులుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ, బొత్స సత్యనారాయణ, సీ రామచంద్రయ్య, ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్, బాలరాజులతోపాటు కేంద్ర మంత్రి చిరంజీవి వంటి వారు తమ జిల్లాల్లో కీలక నేతలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అటు.. గవర్నర్ కు కిరణ్ రాజీనామా సమర్పించాక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అటునుంచి అటే మాయమవటం చర్చనీయాంశంగా మారింది. రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇచ్చినప్పుడు 8 మంది మంత్రులు ఆయనతో కలిసి రాజ్‌భవన్‌కు వచ్చారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి కిరణ్ తిరిగి వెళ్లుతున్నప్పుడు ఆయన వెంట ఏ ఒక్క మంత్రిగానీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గానీ వెళ్లకపోవడం గమనార్హం. వారంతా రాజ్‌భవన్ నుంచే నేరుగా తమ ఇళ్లకు తమ సొంత వాహనాల్లో వెళ్లిపోయారు. వీరిలోనూ.. చాలా మంది కాంగ్రెస్‌లోనే ఉంటారనే ప్రచారం సాగుతున్నది. మరి కొంతమంది టీడీపీలోకి వెళతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీకి వెళ్లే వారిలో గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కొత్త పార్టీ పెట్టాలని కిరణ్‌పై మొన్నటి వరకు తీవ్ర ఒత్తిడి తెచ్చిన మాజీ మంత్రులు జేసీ దివాకర్‌రెడ్డి, గాదె వెంకట్‌రెడ్డి కిరణ్ రాజీనామా కార్యక్రమానికి రాకపోవటం గమనార్హం. మరోవైపు.. సీఎం పదవికి రాజీనామా చేసిన కిరణ్.. క్యాంపు కార్యాలయాన్ని ఖాళీచేశారు. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న తన సొంత నివాసానికి కిరణ్ మారారు. ఇకపై అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించనున్నారు. పదవిని వీడిన తర్వాత వెనువెంటనే ఓ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేయడం ఇదే మొదటిసారి. మొత్తంమీద.. రాష్ర్టంలో మారుతున్న రాజకీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. కిరణ్ భవిష్యత్ కార్యాచరణ ఏంటో తెలుసుకోవాలంటే మరో రెండ్రోజులు వేచిచూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: