ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ఊచకోత కోస్తున్నా.. జర్మనీలో మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇతర దేశాలతోనే కాకుండా.. పొరుగు దేశాల పరిస్థితితో పోల్చి చూసినా జర్మనీ ఎంతో మెరుగైన ప్రతిభ కనబరుస్తోంది. ఆ దేశంలో పాజిటివ్‌ బాధితుల సంఖ్య లక్ష దాటేసింది. మృతులు మాత్రం 16 వందలే. సుమారు 29 వేల మంది కోలుకోవడం విశేషం. ఎందుకిలా? కరోనా విషయంలో జర్మనీ తీసుకున్న జాగ్రత్తలేంటో తెలుసా.. 

 

ప్రపంచంలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య లక్ష దాటిన దేశాల్లో అమెరికాది మొదటిస్థానమైతే  స్పెయిన్‌, ఇటలీ తర్వాతి ప్లేసుల్లో ఉన్నాయి. జర్మనీది నాలుగోస్థానం. అమెరికా, స్పెయిన్‌, ఇటలీ ఎలా అల్లాడిపోతున్నాయో చూస్తూనే ఉన్నాం. జర్మనీ పరిస్థితి కూడా పైకి తీవ్రంగానే కనిపిస్తున్నా.. ఆ దేశంలో ఎలాంటి భయాందోళనలు లేవు. పాలకులూ నీరసించలేదు. దీనికంతటికీ కారణం ఆ దేశంలో ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు చేపట్టిన పకడ్బంధీ చర్యలే. ముఖ్యంగా రోగులను ఆస్పత్రికి తరలించాలన్న ఆలోచనను తమ మెదళ్ల నుంచి తీసేశారు. బాధితుల సంఖ్య అనూహ్యంగా ఉంటుందని భావించి.. సరికొత్త పద్దతులను ఎంచుకున్నారు. రోగులకు ఇళ్ల దగ్గరే చికిత్స  చేయడం.. పరీక్షలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం అక్కడి ప్రజలకు ఊరట నిచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం జర్మనీ రోడ్లపై ఎక్కడ చూసినా కరోనా ట్యాక్సీలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్‌ వల్ల బాధపడుతూ ఇంటిలోనే చికిత్స పొందుతున్న వారిని ప్రతి ఐదారు రోజులకు వైద్యులు ఈ కరోనా ట్యాక్సీలలో వెళ్లి పరీక్షిస్తారు. అవసరమైన సూచనలు చేస్తారు. 

 

ఇంటి దగ్గరే రక్త పరీక్షలు చేస్తారు. ఆరోగ్యం క్షీణిస్తున్నా.. నిరంతరం వైద్యుల పర్యవేక్షణ అవసరం అనుకున్న వారిని మాత్రమే వెంటనే ఆస్పత్రులకు తరలిస్తున్నారు. వైరస్‌ లక్షణాలు కనిపించిన వెంటనే  కంగారు పడాల్సిన పనిలేదని ప్రజలను చైతన్య పర్చడంలో అక్కడి ప్రభుత్వం సక్సెస్‌ అయ్యింది. వైరస్‌ సోకిన తర్వాత ఊపిరితిత్తులు దెబ్బతింటేనే ఆరోగ్యం విషమిస్తుందని.. ప్రాణాలు పోయే ఛాన్సెస్‌ ఉంటాయని వెల్లడించింది. ఆ మేరకు బాధితుల ఆరోగ్య పరిస్థితిని గమనించి చికిత్స  చేస్తున్నారు అక్కడి వైద్యులు. 

 

ప్రస్తుతం  జర్మనీలో 92 వేలకుపైగా ల్యాబొరేటరీలు ఉన్నాయి. అమెరికా, ఇటలీ, స్పెయిన్‌ దేశాలతో పోల్చితే జర్మనీలోని ల్యాబ్‌ల సంఖ్య చాలా ఎక్కువ. వేగంగా స్పందించడం.. బాధితుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం సమీక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయడంతో జర్మనీలో వైరస్‌ బారిన పడిన వారిలో చనిపోతున్న వాళ్లు 1.4 శాతంగా ఉన్నారు. అదే ఇటలీని తీసుకుంటే ఇది 12 శాతంగా, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, బ్రిటన్‌లలో 10 శాతంగా, చైనాలో 4 శాతం, అమెరికాలో 3 శాతంగా ఉంది.  కరోనాను సమర్ధంగానే కట్టడి చేస్తున్న దక్షిణ కొరియాలో సైతం మరణాల రేటు 1.7శాతంగా ఉంది. 

 

జర్మనీలో పరిస్థితిని చూసిన తర్వాత అమెరికా సహా వివిధ దేశాల నుంచి ఇక్కడి డాక్టర్లకు అదే పనిగా ఫోన్లు వస్తున్నాయి. వైరస్‌ను కట్టడి చేయడంలో  ఎలా సక్సెస్‌ అవుతున్నారు? మరణాలు ఎందుకు తక్కువగా ఉన్నాయి? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. వాస్తవానికి జర్మనీలోని ఆస్ట్రియన్‌, ఇటాలియన్‌ స్కై రిసార్ట్స్‌లో తొలుత కరోనా వైరస్‌ బయటపడింది. బాధితులంతా యువతే. ఆరోగ్యంగా ఉన్నవారికే వైరస్‌ సోకడాన్ని వైద్యలు గమనించారు. ఇది వేగంగా వ్యాపించే వైరస్‌గా గుర్తించారు. వృద్ధులకు వ్యాధి సోకితే తట్టుకోలేరని తెలుసుకున్నారు డాక్టర్లు. రెండు వారాల క్రితం వరకూ మరణాల రేటు 0.2శాతంగానే ఉంది. 

 

ఇతర దేశాలతో పోల్చితే జర్మనీలో చాలా మందికి పరీక్షలు చేశారు. దీంతో వైరస్‌ సోకిన వారిని త్వరగా గుర్తించడానికి.. వారికి చికిత్స సకాలంలో ప్రారంభించడానికి వీలు కుదిరింది. దీంతో ఈ వైరస్‌కు బలయ్యే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. ఇదే సమయంలో వైద్య సదుపాయాల కొరత లేకుండా చాలా వేగంగా చర్యలు తీసుకున్నారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని విస్తృతంగా ప్రచారం చేశారు. ఆన్‌లైన్‌లో పొందుపర్చిన సమాచారం ఆధారంగా జనవరి నెల మధ్యలోనే పరీక్షలు ఎలా చేయాలో అవగాహన పెంచుకున్నారు. ఫిబ్రవరిలో మొదటి కరోనా పాజిటివ్‌ కేసు గుర్తించే సరికే.. దేశవ్యాప్తంగా పరీక్షా కేంద్రాలు, పరీక్షా పరికరాలను అందుబాటులో ఉంచారు జర్మనీ అధికారులు. ప్రస్తుతం వారానికి 3 లక్షల 50 వేల మంది పరీక్షలు చేస్తున్నారంటే అక్కడి మెడికల్‌ సామర్థ్యాన్ని, ముందు చూపును అర్థం చేసుకోవచ్చు. యూరప్‌లోని ఏ ఇతర దేశం కూడా ఈ స్థాయిలో చర్యలు చేపట్టలేకపోయింది. వైరస్‌ సోకినా.. ప్రాణాపాయం లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగానే ప్రిపేర్‌ అయ్యారు.  అందువల్లే వైరస్‌ నుంచి సకాలంలో గుర్తించి.. వైరస్‌ తీవ్రత ప్రకారం చికిత్స చేశారు. మహమ్మారి బలి తీసుకోకుండా కాపాడారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: