ఒక్క ట్యూషన్‌ ఫీజు తప్ప మరే ఫీజులు విద్యాసంస్థలు వసూలు చేయకూడదని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఫీజులు  పెంచొద్దని స్పష్టం చేసింది. అయితే ఇది సాధ్యమేనా? దీనిపై యాజమాన్యాలు ఏమంటున్నాయి? పేరెంట్స్‌ అభిప్రాయం ఏంటి?

 

కరోనా ధాటికి అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా సంస్థలు జీతాల్లో కోతలు పెడుతున్నాయి.  ఉపాధి అవకాశాలు కూడా తగ్గే ప్రమాదం ముంచుకొస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చదువులపై భారం తగ్గించేందుకు తెలంగాణ సర్కార్‌ కీలక  నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల నుండి కేవలం ట్యూషన్‌ ఫీజు మినహా మరేమీ వసూలు చేయకూడదని  ఆదేశించారు.  ఎవరైనా ఒత్తిడి తెస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు.

 

తెలంగాణలో 40 వేల పాఠశాలలున్నాయి‌. వీటిలో 10 వేలకు పైగా ప్రైవేట్‌ పాఠశాలలే. హైస్కూలు స్థాయి వరకు దాదాపు 59 లక్షల మంది  విద్యార్దులు ఉన్నారు.  వీరిలో 32 లక్షల మంది ప్రైవేట్‌ స్కూళ్లలో చదువుతున్నారు. ఆయా స్కూళ్లు వాటి స్థాయిని బట్టి ఫీజులు వసూలు  చేస్తున్నాయి. రకరకాల పేర్లతో డబ్బు వసూలు చేయడం సాధారణమైపోయింది. 

 

అయితే ప్రభుత్వ ఉత్తర్వులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి‌. కార్పొరేట్‌ విద్యా సంస్థలు మాత్రమే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తాయని... చిన్నచిన్న ప్రైవేట్‌ పాఠశాలలకు ట్యూషన్‌ ఫీజు తప్ప ఇతర ఫీజులు ఉండవని ప్రతినిధులు చెబుతున్నారు. కరోనా ప్రభావంతో 3 వేల స్కూళ్లు మూత పడే పరిస్థితి ఉందని అంటున్నారు. ఫీజులు కట్టొద్దని ప్రభుత్వం చెప్పడం సరికాదని విజ్ఞప్తి చేస్తున్నారు. 

 

ఇటు ఫీజుల విషయంలో ప్రభుత్వం ఒక పాలసీని తీసుకురావాలని... అలాగే నిర్ణయాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని పేరెంట్స్‌ అంటున్నారు. అలాగే సెంట్రల్ సిలబస్‌తో నడిచే స్కూళ్లను కూడా నియంత్రించాలని చెబుతున్నారు. 

 

మరోవైపు తాజా పరిస్థితుల్నిదృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఆదేశాలు పాటించక పోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది సర్కార్‌. మానవతా దృక్పథంలో యాజమాన్యాలు ఆలోచించాలని అంటున్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మొత్తానికి ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేట్ విద్యాసంస్థలు ఏ మేరకు పాటిస్తాయో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: