కీల‌క‌మైన స‌మ‌యంలో, ముఖ్య‌మైన సామాజిక వ‌ర్గం విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర  పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు వ్య‌వ‌హ‌రించిన తీరు ప్ర‌శంస‌లు అందుకుంటోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేప‌థ్యంలో అన్ని వ‌ర్గాల్లో టెన్ష‌న్ నెల‌కొన‌గా, వివిధ వ‌ర్గాల స‌మ‌న్వ‌యం కోసం కేటీఆర్ స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించారు. రంజాన్‌ మాసం నేప‌థ్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో పలువురు ముస్లిం మత పెద్దలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, ముస్లిం మత పెద్దలు ఖుబుల్‌ పాషా సత్తారీ, ముఫ్తీ ఖలీల్‌ అహ్మద్‌, మహ్మద్‌ పాషా, ఇఫ్తెకారి పాషా తదితరులు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించడమే ప్రజల కర్తవ్యమని, లేనిపక్షంలో వైరస్‌ వ్యాప్తి చెంది ఇతర దేశాల్లో మాదిరిగా మన దగ్గర కూడా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉన్నదని వివరించారు. అనంత‌రం ఎరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని ముస్లిం మతపెద్దలు హామీ ఇచ్చారు. రంజాన్‌ ప్రార్థనలు సైతం ఇళ్ల‌ల్లోనే నిర్వహించుకుంటామని చెప్పారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడటమే మన ముందున్న లక్ష్యమని తెలిపారు.

 

ప్రముఖ ఇస్లామ్‌ సంస్థ జమాయిత్‌ ఉలేమా- ఏ- హింద్ కీల‌క‌ విజ్ఞప్తి చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలకు కట్టుబడి ముస్లింలంతా ఇళ్ల‌ల్లోనే ఉండాలని, రంజాన్‌ సందర్భంగా నిర్వహించే అన్ని రకాల ప్రార్థనలను ఇళ్ల‌ల్లోనే నిర్వహించుకోవాలని కోరింది.  ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడిచేసేందుకు నిర్ణీత దూరాన్ని పాటించడం ఒక్కటే మార్గమని వైద్యనిపుణులు సూచిస్తున్నారని, ప్రార్థన స్థలాలు లేదా ఇతర వేదికల వద్ద జనం గుమిగూడితే ఈ వైరస్‌ మరింత వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. అందుకే ప్ర‌త్యేక ‘తరావీహ్‌' ప్రార్థనలు సహా అన్నీ ఇళ్ల‌ల్లోనే జరుపుకోవాలని ఆ సంస్థ అధ్యక్షుడు మౌలానా అర్షద్‌ మదానీ ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు. కాగా, మంత్రి కేటీఆర్ కీల‌క స‌మ‌యంలో తీసుకున్న చొర‌వ ఫ‌లితంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో రంజాన్ పండుగ నిర్వ‌హణ విష‌యంలో ఇబ్బందులు లేకుండా స‌మ‌న్వ‌యం సాధ్య‌మైంద‌ని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: