విశాఖ మహానగరం ఏపీలోనే అతి పెద్దది.జగన్ సర్కార్ దానికి రాజధాని హోదా కూడా ఇచ్చేసింది. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో గత నెలలో కరోనా ఎంట్రీ ఇచ్చిన తరువాత అందరి చూపూ విశాఖ మీదనే పడింది. విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడంతో పాటు, మొదట్లో కరోనా  కేసులు బాగానే నమోదు అయ్యాయి. 

 

అయితే ఇపుడు విశాఖ మెల్లగా గ్రీన్ జోన్లోకి వెళ్తోంది.  ఈ నెల 6వ తేదీ తరువాత విశాఖలో కరోనా కేసులు 20 వద్దనే నిలకడగా ఉన్నాయి. ఆ తరువాత చూసుకుంటే రెండు రోజుల క్రితం మరో కేసు వచ్చి యాడ్ అయింది. దాంతో 21 కేసులుగా నమోదు అయ్యాయి. ఇక విశాఖలోని కేసుల్లో 19ఇప్పటివరకూ రికవరీ అయి వారంతా ఇంటికి వెళ్ళిపోయారు. ఇపుడు కేవలం ఇద్ద‌రే ఉన్నారు.

 

వీరికి కూడా నయం అయిపోతే మాత్రం విశాఖలో కేసులు జీరో స్థాయికి వస్తాయని అధికారులు చెబుతున్నారు. మరో వైపు విజయ‌నగరం, శ్రీకాకుళం జిల్లాలు ఇప్పటిదాకా ఒక్క కేసు లేకుండా గ్రీన్ జోన్లోకి వెళ్ళిపోయాయి. మే మూడు తరువాత లాక్ డౌన్ పొడిగించినా ఆ జిల్లాలకు పూర్తిగా స‌డలింపు ఉంటుందని అంటున్నారు. ఇక విశాఖ ముందు ఆరెంజి జోన్లోకి, ఆ తరువాత గ్రీన్ జోన్లోకి వెళ్తుంది.

 

ఇక కేసులు విశాఖలో దాచిపెడుతున్నారన్న దాని మీద వైసీపీ నేతలు గట్టిగానే ఖండించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ అయితే చంద్రబాబు పదవికే చాలెంజ్ చేశారు. కేసులు దాచామని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను, లేకపోతే మీరు చేస్తారా అని సవాల్ విసిరారు. ఇక విజయసాయిరెడ్డి కూడా చాతకాని మాటలు అవన్నీ అని కొట్టిపారేశారు. మొత్తానికి చూసుకుంటే విశాఖలో ఇప్పటికైంతే కొత్త కేసులు లేవు. దాంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. మెగాసిటీకి కరోనా ముప్పు తప్పితే అదే పదివేలు కదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: