నోరుజారనేల ...నోటికి తాళం పడనేల...
అమెరికా అధ్యక్షుడి పరిస్థితి ఇలాగే మారింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ధోరణి చివరికి తమ దేశాన్ని నవ్వుల పాలు చేస్తోందని ఆయన సపోర్టర్స్‌ కూడా భావిస్తున్నారట. దీంతో ట్రంప్‌ నోటికి తాళం వేసి... కాస్త పొదుపుగా మాట్లాడాలని భావిస్తున్నారట. ట్రంప్‌ కూడా దీనికే డిసైడ్‌ అయ్యారట. 

 

ఆయన రూటు ఆల్వేస్ సపరేట్. ప్రపంచమంతా ఒకటనుకుంటే... ఆయనగారు  మరొకటి నమ్ముతారు. ఆ మాటలకు ఎలాంటి బేస్ ఉండదు. కామెంట్లకు అడ్డూ అదుపు ఉండదు. సలహాలకు అర్థంపర్థం ఉండదు.

 

ఒకటా రెండా.. ఈ నాలుగేళ్ల కాలంలో ట్రంప్ ఎన్నోసార్లు నోరు జారారు. ఆఖరికి అమెరికా కరోనా సంక్షోభంలో మునిగిన తర్వాత కూడా ట్రంప్ తీరులో మార్పు లేదు. తాజాగా ఆయన  చేసిన ఓ వ్యాఖ్య పెద్ద దుమారమే రేపింది. కరోనా వైరస్ ను చంపడానికి డిసిన్ఫెక్టెంట్ లను రోగుల శరీరంలోకి ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలంటూ ట్రంప్ ఓ ప్రమాదకర సూచన చేశారు. యూవీ రేస్ ని చొప్పించాలని కూడా సలహా ఇచ్చారు. ఓ పక్క ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్లే కరోనాకు ఏ మందివ్వాలి...ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలా అని తలక్రిందులవుతుంటే ట్రంప్ సొంత చిట్కాలను, బేస్ లెస్ సలహాలను ఇచ్చేస్తున్నారు. చివరికి నవ్వుల పాలవుతున్నారు. 

 

ట్రంప్ సలహాలపై అమెరికా ఆరోగ్య నిపుణులు మండిపడ్డారు. ఆయన సొంత పాలకవర్గంలోని ఉన్నతాధికారులు సైతం అసహనం వ్యక్తం చేశారని సమాచారం. చివరికి వెనక్కు తగ్గిన ట్రంప్, అది కేవలం వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు అని సంజాయిషీ ఇచ్చుకున్నారు. ఇక ట్రంప్ తీరును అమెరికన్ మీడియా ఏకిపారేసింది.

 

ప్రపంచమంతా తీవ్ర సంక్షోభంతో కొట్టామిట్టాడుతున్న సమయంలో అగ్రదేశ అధ్యక్షుడు ఈ తరహాలో మాట్లాడటం అమెరికాను నవ్వులపాలు చేయడమే అవుతుందనే అభిప్రాయాలు పెరిగాయి. పైగా ఈ ఏడాది చివర్లో అధ్యక్ష ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ సమయంలో ఇలాంటి  అర్థరహిత వ్యాఖ్యల వల్ల తీవ్ర నష్టం వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు పెరుగుతున్నాయి. ట్రంప్ నోటికి తాళం వేయటమే దీనికి పరిష్కారంగా భావిస్తున్నారట. 

 

ఇక ఎన్నికల ర్యాలీల్లోనూ ట్రంప్ అనేకసార్లు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించిన ఘటనలున్నాయి. ఈ ధోరణిపై ఆయనకు బాగా మద్దతున్న ప్రాంతాల్లోనూ విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే తాను చేసిన వ్యాఖ్యల నుంచి ట్రంప్ అనేకసార్లు వెనక్కి తగ్గిన సందర్భాలు ఉన్నాయి. నోరు జారటమెందుకు.. మళ్లీ సరిదిద్దుకోవటమెందుకు అని భావిస్తున్న ట్రంప్ సన్నిహితులు...కాస్త వెనక్కి తగ్గి నోరు అదుపులో పెట్టుకోవాలని సలహా ఇస్తున్నారట.

 

సాధారణంగా ట్రంప్ తో జరిగే మీడియా సమావేశాలు గంటపాటు కొనసాగుతాయి. అయితే ఈ ప్రెస్ మీట్ లు కూడా సాఫీగా జరగవు. జర్నలిస్టులపై విరుచుకుపడటం, వాదోపవాదాలు జరగటం చాలా కామన్. మరికొన్ని నెలల్లో ఎన్నికలు రానున్న తరుణంలో ఇది ఎంతమాత్రం మంచిది కాదని ఆయన సన్నిహితులు భావిస్తున్నారట. అందుకే కొవిడ్-19కు సంబంధించిన మీడియా సమావేశాల్లో కోవిడ్  టాస్క్ఫోర్స్కు నేతృత్వం వహిస్తున్న ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ లీడ్ తీసుకోనున్నారని తెలుస్తోంది. నిజానికి గతంలోనే ట్రంప్కు ఈ సూచన చేసినప్పటికీ.. ఆయన లైట్ తీసుకుని ఇరకాటంలో పడ్డారు. 

 

వరుసగా అనేక సార్లు ఇరకాటంలో పడుతున్న ట్రంప్‌ కాస్త వెనక్కు తగ్గటమే పరిష్కారంగా గుర్తించినట్టున్నారు. నోరుజారనేల ...వెనక్కు తగ్గనేల అనుకుంటూ కాస్త సైలెంటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: