ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ వాసులు కరోనా లాక్‌డౌన్‌తో రోడ్డున పడ్డారు. తినడానికి తిండి లేక ఉండటానికి ని నివాసం లేక బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. దేశం కాని దేశంలో అనేక అవస్థలు పడుతున్న తమను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని  ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు కోరుతున్నారు. 

 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, సిరిసిల్ల నుంచి ఉపాధి నిమిత్తం పెద్ద సంఖ్యలో గల్ఫ్ దేశాలైన దుబాయ్, సౌదీ అరేబియా, కువైట్ లాంటి దేశాలకు వెళ్తుంటారు..అయితే ఉన్న ఫలంగా కరోనా మహమ్మారి వీరి జీవితాలను బుగ్గి చేసింది.  లాక్ డౌన్ కారణంగా ఉపాధి, తిండి, ఉండటానికి నివాసం లేక రోడ్లు మీదే జీవనం సాగిస్తున్నారు జిల్లా వాసులు. అసలే రోజు రోజుకూ అక్కడ పాజిటివ్ కేసులు కూడా ఎక్కువగా నమోదు అవుతున్న తరుణంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు.. ఇటు స్వదేశానికి రాలేక అక్కడ ఉండలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు... ఎవరో దాతలు దయతలచి భోజనం పెడితే తప్ప తినే పరిస్థితి లేదని వాపోతున్నారు.

 

గల్ఫ్‌లో రోజు రోజుకు పరిస్థితి చేయిదాటిపోతోందని... తమపై అక్కడి ప్రభుత్వ ప్రత్యేక పర్యవేక్షణ లేక ఇబ్బందులు పడుతున్న తీరును సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు...బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో ఇరుకు గదుల్లో దుర్భర జీవితాన్ని గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కపక్కనే  కరోనా పాజిటివ్‌ వ్యక్తులున్నా అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని భయాందోళన చెందుతున్నారు. తమను స్వదేశం తీసుకుపోవడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు విన్నవించుకుంటున్నారు.

 

ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకొని గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారికి ఇప్పుడు కరోనా శాపంగా మారింది..ఇటు స్వదేశానికి రాలేక అక్కడ ఉండలేక నరకయాతన అనుభవిస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితుల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాలి మరి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: