కరోనా మహమ్మారి ఎందరో కూలీల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. లాక్ డౌన్ కారణంగా పనులు లేక,  కడప జిల్లాలో బీడీ కార్మికులు ఆకలితో పస్తులుంటున్నారు.  


 
కడప జిల్లా బీడీ పరిశ్రమకూ పెట్టింది పేరు. జిల్లాలో వ్యవసాయ రంగంతో సమానంగా బీడీ పరిశ్రమ కొనసాగుతోంది. జిల్లాలో బీడీ కుటీర పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ తయారైన బీడీలు దేశ వ్యాప్తంగా ముప్పావు వంతు రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి.ఇక్కడ తయారయ్యే బీడీలకు దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ లభిస్తోంది.

 

ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో ఉత్పత్తి లేక బీడీ కంపెనీలు మూతపడ్డాయి. ముడిసరుకు లేక బీడీల తయారీ పూర్తిగా ఆగిపోయింది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌ పరిస్థితులు, పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు చేస్తున్న ప్రచారాలు, బీడీ పరిశ్రమను దెబ్బతీస్తూ వస్తున్నాయి.లాక్ డౌన్ కారణంగా బీడీ ఎగుమతులు పూర్తిగా ఆగిపోవడంతో, కంపెనీలు మూసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.  బీడీ చుట్టే కుటీర కార్మికుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. 

 

కడపజిల్లాలో ముఖ్యంగా కమలాపురం, రాయచోటి, కడప ప్రాంతాల్లో బీడీ పరిశ్రమలు ఉన్నాయి.ఇక్కడ తులసి, మేకమార్కు, సంఘం, మోహన్, చాంద్, మైనర్ బాబు, నారదా, వంకాయ, కూజా వంటి పలు రకాల కంపెనీ బీడీలు తయారవుతాయి. ఇందులో కడపలో తయారయ్యే మేకమార్కు, తులసి బీడీలకు దేశవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది.

 

ఇక్కడ తయారయ్యే కొన్ని రకాల బీడీలు కట్ట పది రూపాయలకే అమ్ముతారు. మేకమార్కు, తులసి బీడీలు మాత్రం ఒక్కో కట్ట 20 నుంచి 30 రూపాయలు. ఈ కంపెనీల కింద దాదాపు వెయ్యి వరకు బ్రాంచీలుండగా,  వాటిల్లో సుమారు లక్ష మంది వరకు కార్మికులు బీడీలు చుడుతూ జీవనం సాగిస్తున్నారు.

 

జిల్లాలో కమలాపురంలోని బీడీ కాలనీలో 400 వందల వరకూ బీడీ కుటీర పరిశ్రమలు ఉన్నాయి. రోజూ బీడీలు చుట్టి వచ్చిన కూలీతో ఎంతోమంది జీవనం సాగిస్తుంటారు. ఇద్దరు బీడీ కార్మికులు కలిపి రోజులో వెయ్యి బీడీలు చుడతారు.  వెయ్యికి 130 రూపాయల చొప్పున కూలీ ఇస్తుంటారు. డిమాండ్ మేరకు పని దొరికే పరిస్థితి కావడంతో,  వారంలో మూడు రోజులే పని దొరుకుతుంది. ప్రస్తుతం లాక్ డౌన్ తో డిమాండ్ లేని కారణంగా, వారంలో ఒక్కరోజు కూడా కూలీ దొరకడం లేదని కార్మికులు వాపోతున్నారు. 

 

చిన్నప్పటి నుండీ వారికి బీడీ చుట్టే పని ఒక్కటే తెలిసి ఉండటంతో, ఇతరత్రా కూలీ పనులకు కూడా వెళ్లలేక ఇంటికే పరిమితమవుతున్నారు. పనిలేక.. పస్తులూ ఉండలేక   కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైంది. బీడీలు చుట్టే కార్మికులకు అటు యాజమాన్యాల నుండి గానీ, ఇటు ప్రభుత్వాల నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి భృతి అందలేదు. లాక్ డౌన్ వేళ తమను ఆదుకునే నాథుడే లేడని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పస్తులుంటున్న తమను  ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: