కరోనాను తరిమికొట్టేందుకు భౌతిక దూరం ఒక్కటే మార్గం. ఒకరికొకరు కనీసం ఒకటిన్నర మీటరు దూరం పాటిస్తే... కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు. అయితే... చాలా సందర్భాల్లో జనం తమకు తెలియకుండానే... దగ్గర దగ్గరగా మసలుతున్నారు. ఈ పొరపాటుకు చెక్‌ పెట్టేందుకు ఇప్పుడు ఓ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. 

 

ప్రపంచవ్యాప్తంగా జనం భౌతిక దూరం పాటించేలా... వన్ పాయింట్‌ ఫైవ్‌ అనే యాప్‌ రూపొందించింది ఐక్యరాజ్యసమితి. మన 'ఆరోగ్య సేతు' లాంటిదే ఇది కూడా. ప్లే స్టోర్ లేదా యాప్‌ స్టోర్‌లో అందుబాటులో ఉన్న వన్‌ పాయింట్‌ ఫైవ్ యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. కచ్చితంగా మొబైల్‌లో బ్లూటూత్‌, జీపీఎస్‌ ఆన్‌లో ఉంచాలి. ఒప్పొ, వివో, షావోమీ, రియల్‌మీ లాంటి ఫోన్లు వాడేవారైతే ఆటో స్టార్ట్‌లో పెట్టుకోవాలి. 

 

మొబైల్‌లో వన్‌ పాయింట్‌ ఫైవ్ యాప్‌ ఓపెన్‌ చేయగానే 'గెట్‌  స్టార్టెడ్‌' అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేసి... మీ చుట్టుపక్కల ఎన్ని మీటర్ల దూరంలోకి ఇతరులు వస్తే హెచ్చరించాలనేది నిర్ణయించుకోవాలి. అది ఒకటిన్నర మీటరా లేక 2 మీటర్లా? అనేది మన ఇష్టం. సెలెక్ట్‌ చేసుకున్నాక... బ్లూటూత్‌ ఎనేబుల్‌ చేయాలి. ఆ తర్వాత జీపీఎస్‌ లొకేషన్‌ యాక్సెస్‌కు అనుమతివ్వాలి. ఆ తర్వాత... అలారమ్‌, వైబ్రేషన్‌ మోడ్స్‌లో ఏదో ఒకటి సెలెక్ట్‌ చేసుకోవాలి. అంతే... ఒకేసారి ఎంతమంది యూజర్లు దగ్గర్లోకి వచ్చినా... అలారం మోగుతుంది. వాళ్ల మొబైల్ మోడల్‌ పేరుతో ఎంతదూరంలో ఉన్నారనేది చూపిస్తుంది. దగ్గర్లో ఎవరూ లేకపోతే భౌతిక దూరం పాటిస్తున్నందుకు ధన్యవాదాలు అని మొబైల్‌ స్క్రీన్‌ మీద సందేశం కనిపిస్తుంది. అయితే... ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబసభ్యులు దగ్గరికి వస్తే అలారం మోగకుండా... వారి సెల్‌ఫోన్లకు మినహాయింపు ఇచ్చే ఆప్షన్‌ కూడా ఇందులో ఉంది. 

 

వన్ పాయింట్‌ ఫైవ్‌ యాప్‌ యూజర్ల నుంచి ఎలాంటి సమాచారం సేకరించదని డెవలపర్‌ చెబుతున్నారు. కేవలం ఓపెన్‌ చేసినప్పుడు లొకేషన్‌ సమాచారాన్ని యాక్సెస్‌ చేసేలా ఈ యాప్‌ను రూపొందించారు. అలాగే ఆరోగ్య సేతు యాప్‌ తరహాలో ఆరోగ్య సమాచారం లాంటివి ఈ యాప్‌ తీసుకోదు. కేవలం భౌతిక దూరం పాటించడానికే ఉపయోగపడుతుంది. అవతలి వ్యక్తి కూడా ఆ యాప్‌ వాడితేనే అది పని చేసి అలారం మోగుతుంది. కాబట్టి... ఈ యాప్‌ను ప్రతి మొబైల్‌ యూజర్‌ వాడటం ప్రారంభిస్తే... భౌతిక దూరం కచ్చితంగా పాటించి... కరోనాను తరిమికొట్టడం పెద్ద కష్టమేం కాదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: