ఏపీలో కర్నూలు జిల్లా తర్వాత గుంటూరు జిల్లాలో కరోనా కోరలు చాచింది. ఒకే ఒక్క కేసుతో మొదలై విశ్వరూపం చూపిస్తోంది. గుంటూరు, నరసరావుపేటల్లో వందల్లో నమోదవుతున్న కరోనా కేసులు జిల్లా వాసులను వణికిస్తున్నాయి.

 

కరోనా వైరస్ గుంటూరు జిల్లాలో అత్యంత వేగంగా విస్తరించింది. ఢిల్లీ జమాత్ వేదికగా గుంటూరు నగరంలో తొలి కేసు నమోదయ్యింది. అక్కడ నుండి పల్నాడు కు...పల్నాడు నుంచి జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు పాకింది. గుంటూరు తర్వాత పెద్దకూరపాడు, మాచర్ల, మంగళగిరి, పొన్నూరు,  నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరి పేట కరోనా కోరల్లోకి వెళ్లిపోయాయి. అయితే జిల్లా మొత్తంలో గుంటూరు, నరసరావుపేటలోనే కరోనా వ్యాప్తి స్థాయి తీవ్రంగా ఉంది. ఇక్కడ వందల మందికి వైరస్ సోకడంతో జిల్లా వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 306కు పెరిగిపోయింది. మొత్తం కేసుల్లో గుంటూరు, నరసరావుపేట నుంచి 250 కేసులున్నాయి. ఇవాళ ఒక్కరోజే గుంటూరు జిల్లాలో 19 కేసులు నమోదయ్యాయి. వీటిలో 17 నరసరావుపేటవే.

 

నరసరావుపేట...నివురుగప్పిన నిప్పులా ఉంది.. గుంటూరు జిల్లా మొత్తానికి నరసరావుపేట కరోనా వ్యాప్తి కేంద్రంగా మారిపోయింది. వందకు పైగా కేసులు నమోదకావడం అధికారులను,ప్రజలను కలవర పెడుతోంది. నరసరావుపేటలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 600 మంది రిపోర్టులు పెండింగ్‌లో ఉన్నాయి. అవి కూడా వస్తే కేసుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. కరోనా నియంత్రణకు పోలీసులు తమ స్థాయిలో లాక్‌డౌన్‌ను గట్టిగానే అమలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు రోజుల పాటు ఫుల్ లాక్‌డౌన్‌ను విధించారు. 

 

మొదట కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి చనిపోయాక ఎప్పటికో గానీ వైద్య నివేదిక రాలేదు. అంతలోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తొలి కేసు వచ్చిన వ్యక్తికి కరోనా కాంటాక్ట్ ఎక్కడ జరిగిందనేది అందుపట్టలేదు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుంటూరుకు చెందిన పాజిటివ్‌ వ్యక్తిని కలిసినట్టు నిర్ధారించారు. ఆ తర్వాత జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అప్పటికే 105 పాజిటివ్ కేసులు నరసరావుపేటను చుట్టేశాయి. దీంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా ఫుల్ లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు.

 

రెడ్‌ జోన్‌లో ఉన్న వారికి వైద్యపరీక్షలు వేగవంతం చేస్తున్నారు.వృద్దులు,అనారోగ్యంతో బాధపడే వారికి ముందుగా కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. మరణాల సంఖ్యను తగ్గించడం ద్వారా పాజిటివ్ కేసుల లింక్‌ను తెంచేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తోంది. గుంటూరు లో పాజిటివ్ కేసులు నిలకడగా ఉండగా గుంటూరు నుండి వెళ్లిన కరోనా వైరస్ నరసరావుపేటలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. 

 

కేసులను కట్టడి చేస్తున్నందుకు జిల్లా యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేస్తున్నా...ఏరోజుకారోజు కొత్త కేసులు పదుల సంఖ్యలో రిపోర్టవుతూనే ఉన్నాయి.  గుంటూరు సిటీలో కరోనా కేసు నమోదైన మంగళ్ దాస్ నగర్‌లో ఇప్పటికీ టెన్షన్ వాతావరణమే ఉంది. ఒక ప్రజా ప్రతినిధి కుటుంబానికి చెందిన వ్యక్తికి తొలిసారిగా కరోనా వచ్చింది. అక్కడి నుంచి ఆయన కుటుంబం చుట్టూ కరోనా రాజకీయం నడిచింది. చివరకు ఆయన కుటుంబ సభ్యులు గన్ మెన్ తో సహ మెత్తం 19మంది క్వారంటైన్ కు వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ప్రజాప్రతినిధికి నెగిటివ్ అని తేలినా ఆయన్ను హోం క్వారంటైన్‌లోనే ఉంచారు అధికారులు. గుంటూరు నగరంలోని ఒక బిర్యాన్ని హోటల్ నిర్వాహకుడు కూడా కరోనా పాజిటివ్ తో చనిపోయాడు.ఆయన్న ఖననం చేసే విషయంలో కూడా మతపరమయిన ఆచారాలు వ్యవహరంలో అధికారులపై తీవ్ర వత్తిడి వచ్చింది. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని రాజకీయ ఒత్తిడులు వచ్చినా అధికారులు అంగీకరించలేదు. బిర్యానీ హోటల్ నిర్వాహకుడికి రహస్యంగా వైద్యం అందించినందుకు ఓ ప్రైవేటు ఆస్పత్రిపై పోలీసులు కేసు పెట్టారు.

 

గుంటూరు, నరసరావుపేట తర్వాత పల్నాడులో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక వ్యక్తి గుంటూరు నుంచి  పశువేములకు వెళ్ళటంతో కరోనా కలకలం మెలైంది.ఇక మంగళగిరి ,  పొన్నూరు, పెద్దకూరపాడు, సత్తెనపల్లి,వినుకొండ చిలకలూరిపేటలో కూడ కరోనా పాజిటివ్ కేసులు నమోదైనా... పరిస్థితి అదుపులోనే ఉంది. నరసరావుపేట ఒక్కటే జిల్లా యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: