ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా  వైరస్ విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో అతి తక్కువగా నమోదైన కేసులు క్రమక్రమంగా మితిమీరిపోతున్నాయి. భారీగా నమోదవుతున్న కేసులతో అటు అధికారులు కూడా అయోమయంలో పడిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ కేసుల సంఖ్య మాత్రం పెరిగిపోతూనే ఉంది. ప్రతిరోజు 50కి పైగా కొత్త కరోనా  కేసులు నమోదవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కరోనా  వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా అది నీటిలో పోసిన పన్నీరులా  అయిపోతుంది. కొంతమంది నిర్లక్ష్యం కారణంగా కరోనా  వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతూనే ఉంది. 

 

 

 అయితే కరోనా  వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న వేళ రాష్ట్ర ప్రజానీకం మొత్తం భయాందోళనలో కొట్టుమిట్టాడుతోంది. ఈ  క్రమంలోనే ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి కుటుంబంలో ఒకరికి కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు నిర్వహించాలని సంచలన నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. ఇందులో భాగంగానే తొలుత ప్రతి కుటుంబంలో ఒకరికి కరోనా  పరీక్షల విధానాన్ని రెడ్  జోన్ మండలాల్లో  అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా గూడురు మండలం లో ప్రతి ఇంట్లో ఒకరికి ర్యాండమ్ గా  కరోనా  పరీక్షలు నిర్వహించారు. 

 

 

 గ్రామ వాలెంటర్ల్లు అందరూ తమ పరిధిలోని 50 కుటుంబాల్లో .. కుటుంబానికి ఒక్కరు చొప్పున పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన ఫలితాలు రెండు రోజుల్లో వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షకుపైగా కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పటివరకు 1, 08, 403 మందికి  వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1525 మందికి పాజిటివ్ అని తేలింది. వీరిలో 441 మంది ఈ మహమ్మారి బారినుంచి చికిత్స పొందుతూ కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ గా ఉన్న కేసులు 1051. ఈ క్రమంలోనే సడలింపు లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గ్రీన్ జోన్ లోని వారికి మాత్రమే సడలింపులు ఉంటాయని స్పష్టంగా చెప్పింది ఏపీ సర్కార్.

మరింత సమాచారం తెలుసుకోండి: