ప్రకాశం జిల్లాలో కరోనా ఎఫెక్ట్ కల్లు గీత కార్మికులపై పడింది. లాక్ డౌన్ కారణంగా కల్లు గీతని ప్రభుత్వం నిషేధించింది. ఉపాధి కోల్పోయిన గీత కార్మికులు రోడ్డునపడ్డారు.  ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

 

లాక్ డౌన్ దెబ్బకి ప్రకాశం జిల్లాలో కల్లుగీత కార్మికులు ఉపాధి కోల్పోయారు. జిల్లాలో నాలుగు వేల మంది కల్లుగీత కార్మికులు ఉన్నారు. వీరంతా కల్లుగీతపై ఆధారపడి జీవిస్తుంటారు. ఏడాది మొత్తంలో నాలుగు నెలల పాటూ ఉపాధి దొరుకుతుంది. 


 
ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లోనే తాటి చెట్ల నుండి కల్లు ఉత్పత్తి అవుతుంది. తాటి చెట్ల నుండి కల్లు తీసుకునేందుకు గీత కార్మికులు ఒక్కొక్క చెట్టుకి 2,500 నగదు,  రైతులకు చెల్లించాలి. ఇలా ఒక్కొక్క గీత కార్మికుడు లక్ష నుండి మూడు లక్షల వరకూ రైతులకు అడ్వాన్సు చెల్లించి కల్లుగీసుకుంటారు. కల్లు ఉత్పత్తి అయ్యే నాలుగు నెలల్లో రైతులకు చెల్లించింది పోను...మిగిలిన దాంతో ఏడాది మొత్తం గీత కార్మికులు కుటుంబాన్ని పోషించుకుంటారు.   

 

మార్చి 23 నుండి విధించిన లాక్ డౌన్ కారణంగా కల్లుగీత కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారు. దీనికితోడు కల్లుగీతపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఆంక్షలు విధించారు. చెట్లకు ఉన్న కుండలను ఎక్కడికక్కడ ఎక్సైజ్ సిబ్బంది పగలగొట్టారు. ఇప్పటికే రైతులకు చెల్లించిన నగదు వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. సీజన్ లో 40 రోజులు కల్లు గీత నిలిచిపోవడంతో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

 

కల్లు ఉత్పత్తికి మరో నెల రోజులు అవకాశం ఉంది. దాంతో కల్లు అమ్ముకునేందుకు అవకాశం కల్పించాలని గీత కార్మికులు కోరుతున్నారు. సరిగ్గా సీజన్ లో ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో,  గీత కార్మికులకు ఆర్థికంగా నష్టాన్ని మిగిల్చింది. ఆర్ధికంగా చితికిపోయిన తమను ఆదుకోవాలని కల్లుగీత కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: