లాక్ డౌన్ వేళ .. భద్రాద్రి జిల్లా అధికారుల అత్యుత్సాహం..  పొరుగు జిల్లాల వారికి శాపంగా మారుతోంది. వలస కూలీలు మొదలుకొని అన్నింటిలో పక్క జిల్లా నుంచి ఎవ్వరినీ రానివ్వకుండా అడ్డు తగులుతున్నారు. ఉమ్మడి జిల్లా వాసులతో గొడవ  పెట్టుకుంటున్నారు.దీంతో ఇరు జిల్లా అధికారుల మధ్య మనస్పర్ధలు పెరుగుతున్నాయి.  

 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం,  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మధ్య గొడవ రాజుకుంటోంది. కరోనా ఎఫెక్ట్ తో మొట్ట మొదటగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేసులు వచ్చాయి. ఇద్దరు విదేశీయుల వల్ల కేసులు నమోదయ్యాయి. వాటితో పాటు మరిన్నికేసులు పెరిగాయి. మర్కజ్ నుంచి పది మంది వరకు వచ్చారు. అయితే వారి వల్ల ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలను ప్రారంభించారు. దీంతో కొత్త కేసులు రాలేదు.  

 

కేంద్ర ప్రభుత్వం కూడా అభినందించింది. అయితే ఈ అభినందన మాటేమో కానీ.. పక్క జిల్లా వారి పట్ల సఖ్యతతో ఉండటం లేదు. చత్తీస్ ఘడ్ కు చెందిన వలస గిరిజనులు,  హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ భద్రాచలానికి చేరుకున్నారు. వందల కిలోమీటర్లు నడిచిన వారు,  ఇంకో గంట నడిస్తే వారు తమ స్వస్థలాలకు చేరుకోవాల్సి ఉంది. ఆ విషయం కాస్త పోలీసులకు తెలిసింది. 

 

వలస కూలీలను లారీల్లో ఎక్కించుకొని ఖమ్మం జిల్లాలో వదిలివేశారు. అటు చత్తీస్ ఘడ్ కు వెళ్ల నిచ్చినా బాగుండేది  లేదా వారు ఎక్కడ నుంచి వచ్చారో అక్కడకు పంపించితే బాగుండేది. మణుగూర్ కు వెళ్లిన వలస కార్మికులను అదే విధంగా చేశారు. ఇకపోతే సూర్యాపేట నుంచి అశ్వరావుపేటకు అక్కడి పోలీసుల అనుమతితో,  తమ గ్రామానికి కూలీలు చేరుకున్నారు.వారిని కూడ ఖమ్మం జిల్లాకు చెందిన సత్తుపల్లిలో వదిలివేశారు. 

 

ఇకపోతే భద్రాద్రి జిల్లావాసులు, వైద్యం కోసం ఖమ్మం జిల్లాకు రావలసి ఉంటుంది. వారిని కూడ రానివ్వకుండా అడ్డుకుంటున్నారు.వారు తిరిగి వస్తే తమకు ఎక్కడ ఇబ్బంది జరుగుతుందో అన్న ఆందోళన ఉందట. తాజాగా ఓ అధికారి ఖమ్మం నుంచి భద్రాద్రి జిల్లాకు నిరంతరం అప్ అండ్ డౌన్ చేస్తుంటుంది. ఆమెపై ఆ జిల్లా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

భద్రాద్రి జిల్లా అధికారుల అత్యుత్సాహంపై ఖమ్మం జిల్లా అధికారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు ఉమ్మడి జిల్లాలో ఉన్న వారు సర్దుకొని పోయి,  సమస్యను పరిష్కరించుకునే విధంగా ఉండాలని సూచిస్తున్నారు. కయ్యానికి కాలు దువ్వొద్దని అంటున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: