అవును మరి పొరుగింటి పుల్ల కూర ఎపుడూ బాగుంటుంది. ఎందుకంటే వారితో పేచీ పూచీ ఉండదు కాబట్టి. అందుకే ఈ సామెత పుట్టుకువచ్చిందేమో. ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కూడా పొరురు రాష్ట్రాలు బాగా నచ్చుతున్నాయి. మరీ ముఖ్యంగా బీజేపీ రాష్ట్రాలు  చాలా బాగా నచ్చుతున్నాయి.

 

చంద్రబాబు లేటెస్ట్ గా కర్నాటక సీఎం యడ్యూరప్పకు ఫోన్ చేశారట. అక్కడ చిక్కుకున్న ఏపీ  మత్య్సకారుల గురించి వాకబు చేశారుట. అంతటితో ఆగకుండా కరోనా నివారణకు కర్నాటక సర్కార్ తీసుకున్న చర్యలు బాగున్నాయని పొగిడారుట. బాగుంది. పాలనాదక్షుడు అని బాబు అంటున్న ఇదే యడ్యూరప్పను గద్దె దించడానికి 2018లో చంద్రబాబు తన సర్వ శక్తియుక్తులు ఉపయోగించారన్న సంగతి కూడా తెలిసిందే.

 

ఆనాడు కుమారస్వామి పట్టాభిషేకానికి హాజరై కాంగ్రెస్ కు కన్ను గీటింది కూడా ఇదే చంద్రబాబు. ఇపుడు ఓడాకా బీజేపీ మీద మోజు పెరిగింది. మోడీ మీద గురి కుదిరింది. ఇక గుజరాత్ సీఎం విజయ్ రూపానీకి కూడా బాబు ఆ మధ్య ఫోన్ చేశారు. మరో వైపు నేరుగా కేసీయార్ని పొగడడం బాగుండదేమో లేక తన కంటే జూనియర్ అనుకున్నారేమో కానీ తన పార్టీ తమ్ముళ్ళ చేత కితాబులు ఇప్పించారు చంద్రబాబు.

 

కర్నాటకలో కరోనా కేసులు ఉన్నాయి. గుజరాత్ లో ఇంకా ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా కరోనా మహమ్మారి ఉంది. కానీ వారంతా బాగా చేస్తున్నట్లు బాబు గారి లెక్క. కానీ ఏపీ సీఎం మాత్రం ఏమీ చేయడం లేదు. ఎందుకంటే జగన్ అక్కడ సీఎం. ఆయన ఆగర్భ‌ శత్రువు అన్నట్లుగా బాబు వైఖరి ఉంది. 

 

అనుభవశాలిగా ఈ కీలకమైన టైంలో సలహాలు ఇస్తే బాబు గౌరవం రెట్టింపు అయ్యేది, అది మానేసి తెల్లారిలేస్తే విమర్శలు చేయడం అంటే బాబు రాజకీయంగా ఏమి ఆశిస్తున్నారో అర్ధం కావడంలేదని అంటున్నారు. తనను ఓడించిన ఏపీ ప్రజలకు దూరంగా పొరుగు రాష్ట్రంలో ఉంటున్న బాబుకు ఏపీ మీద ప్రేమ ఏమి ఉంటుందని వైసీపీ నేతలు అంటున్నారంటే ఆలోచించాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: