తెలంగాణ రాష్ట్రంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు పైగానే నమోదవుతున్నాయి. అంతేకాదు అకాల వర్షాలు సైతం రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో చాలా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్‌ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి మొమిన్ పేట్, నవాబుపేట్ మండలాల్లో వేసవికాలంలోనూ జోరుగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదకు అక్కడక్కడ రోడ్లు తెగిపోగా.. పలు చోట్ల కరెంట్ స్తంభాలు నేలకూలిపోయాయి. దీంతో మొమిన్ పేట్- శంకర్ పల్లి మధ్య వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.  

 

తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావమే ఇందుకు ప్రధాన కారణం. రైతులు ఎన్నో ఆశలు పెట్టుకొని.. కష్టానికి నష్టానికి ఓర్చి వేసుకున్న పంటలు.. వడగండ్ల వానల దెబ్బకు నాశనమైపోతున్నాయి. ఈదురుగాలులకు వరి, మామిడి రైతులు కోలుకోలేని దెబ్బతీసుకుంటున్నారు. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు పలు చోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. 
వాగులు వంకలు నిండటం బాగానే ఉంది కానీ.. ఈదురు గాలులతో పంటలు నాశనమవడం రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

 

రంగారెడ్డి జిల్లాలో ఈదురు గాలులకు చేతికొస్తున్న మామిడి కాయలు రాలిపోయి రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. ఈ నెల ఆరంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన ఈదురుగాలులు, వడగళ్ల వర్షానికి బొప్పాయి, పుచ్చకాయతోపాటు కూరగాయలు, పూల తోటలకు భారీగా నష్టం చేకూరింది. వికారాబాద్ జిల్లాలో ఉద్యాన పంటలు వడగళ్ల వర్షానికి దెబ్బతిన్నాయి. అన్నదాతలకు కోట్లాది రూపాయల నష్టం చేకూరడంతో దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లిపోయారు. ఇక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఉరుములు, వడగాళ్లతో కూడిన వర్షం బీభత్సంగా కురిసింది. అకాల వర్షానికి చేతికొచ్చిన పంట నీటిపాలవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అంతేకాదు గాలివానకు పలుచోట్ల మొక్కజొన్న పంట నీటిపాలైంది. ఇదిలా ఉంటే వాతావరణ శాఖ రైతులకు పిడుగులాంటి వార్త అందించింది. మరో మూడు రోజ పాటు ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతుందనీ.. ఈ కారణంగా తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: