బెంగాల్ వలస కూలీల వివాదానికి తెరపడింది. అంతకుముందు వలస కార్మికులను స్వస్థలాలకు పంపించడానికి కేంద్రానికి పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటూ అమిత్ షా ఆరోపించారు. కేంద్రం తీరుపై తృణమూల్ విరుచుకుపడింది.

 

కేంద్రం, పశ్చిమ  బెంగాల్ మధ్య వలస కార్మికుల వివాదం ముగిసింది. లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికుల తరలింపుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది.  దీనికోసం ఎనిమిది ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెబుతోంది.   

 

అంతకుముందు వలస కార్మికుల తరలింపు విషయంలో వివాదం నడిచింది. పశ్చిమ బెంగాల్ సర్కారు కేంద్రానికి సహకరించడం లేదంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు మారకుంటే వలస కార్మికుల కష్టాలు రెట్టింపు అవుతాయని.. శ్రామిక్ రైళ్లను రాష్ట్రంలోకి అనుమతించకపోవడం అన్యాయమని విమర్శించారు. 

 

కరోనా సంక్షోభం ప్రారంభం నుంచి కేంద్రం పశ్చిమ బెంగాల్, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి.  వాస్తవాలను దాచి ఆ రాష్ట్ర ప్రభుత్వం కరోనా మరణాలను తక్కువగా చేసి చూపిస్తున్నట్లు ఆ రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం అభ్యంతరం తెలిపింది. అయితే ఈ క్లిష్ట సమయంలో రాష్ర్టానికి సహాయంగా ఉండాల్సిన కేంద్రం పోలిటికల్ వైరస్ను వ్యాప్తి చేస్తుందని టీఎంసీ విమర్శిస్తోంది. పరిస్థితిని డీల్ చేయడంలో మమతా సర్కార్ విఫలమైందని కేంద్రం ప్రచారం చేయాలనుకుంటోందని మండిపడుతోంది. 

 

వలస కార్మికులకు సంబంధించిన రైళ్లపై కేంద్రం చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని తృణమూల్ పార్టీ మండిపడుతోంది. లాక్ డౌన్ కారణంగా బెంగాల్ లో   చిక్కుకుపోయిన వలస కూలీలను స్వస్థలాలకు పంపించడానికి రైళ్లను అనుమతిస్తున్నామని తెలిపింది. వలస కూలీల కోసం ఇప్పటి వరకూ 711 శిబిరాలను ఏర్పాటు చేసి వారి అవసరాలను తీరుస్తున్నామని ప్రకటించింది. వలస కూలీల విషయంలో కేంద్రం విఫలమై దాన్ని రాష్ట్రాలపై రుద్దుతోందని విమర్శించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: