నిన్నటిదాకా మొబైల్‌ లో ఆర్డర్‌ ఇవ్వగానే ఇడ్లీ, దోసె నుండి బిర్యానీ వరకు నిమిషాల్లో ఇంటికి డెలివరీ అయ్యేది. ఇప్పుడు మద్యం కూడా ఈ జాబితాలో చేరితే..? చిన్ని క్లిక్‌ ఇవ్వగానే బీర్‌ బాటిల్‌, విస్కీ సీసా చేతిలో వాలితే ఎలా ఉంటుంది? కరోనా కాలంలో సోషల్‌ డిస్టన్స్‌ ముఖ్యంగా భావిస్తున్న తరుణంలో మద్యం హోమ్‌ డెలివరీ మంచిదని సాక్షాత్తూ సుప్రీం కోర్టు కూడా అభిప్రాయపడుతోంది. మరి ..ఇందులో సాధ్యాసాధ్యాలేంటి?

 

కొన్నేళ్లుగా ప్రపంచమంతా అలవాటైన మాట. నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి, ఆహార పదార్థాల వరకు ...ఏదైనా గుమ్మం ముందు వాలిపోతుంది. ఇల్లు కదిలే పనిలేదు.. జస్ట్ వెబ్ సైట్ లోనో, యాప్ లోనో చిన్న క్లిక్‌ చాలు. మొదట్లో పెదవివిరిచినా ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సర్వీసులకు, స్విగ్గీ, జొమాటోలు అందించే టిఫిన్స్, మీల్స్, బిర్యానీలకు అందరూ అలవాటైపోయారు. క్షణాల్లో మొబైల్ లో ఆహారపదార్థాలను బుక్ చేసి, నిమిషాల్లో  వేడివేడిగా ఆరగించటానికి అందరూ ఇష్టపడుతున్నారు. ఇదే సర్వీసుని మద్యానికి కూడా విస్తరింపజేస్తే ఎలా ఉంటుంది? ఆన్‌ లైన్‌ లో పెగ్గులు పరిగెత్తుకొస్తే కస్టమర్లు పట్టంకట్టేస్తారా? కరోనా కాలంలో ఓ సేఫ్టీ మెథడ్ గా మొదలై, చివరికి స్థిరపడిపోతుందా? అసలు లిక్కర్ హోం డెలివరీకి ఉన్న సాధ్యాసాధ్యాలేంటి?

 

సుమారు 40 రోజుల లాక్ డౌన్ తర్వాత మద్యం షాపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. దీంతో మందుబాబుల ఉత్సాహానికి అంతేలేదు. ఎన్నాళ్లో వేచిన ఉదయం అనుకుంటూ...రాత్రంతా ఆత్రంగా గడిపారు. తెల్లారగానే వైన్ షాప్ షటర్ల ముందు కిలోమీటర్ల మేర బారులు తీరారు. దాదాపుగా మద్యం విక్రయాలు ప్రారంభించిన అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో ఒక్కరోజు మద్యం అమ్మకాలతో 40 రోజుల లాక్ డౌన్ ఫలితం తుడిచిపెట్టుకుపోయిందనే విమర్శలొచ్చాయి. సోషల్ డిస్టన్స్ లేదు.. మాస్కులు లేవు.. కరోనా ఉందన్న స్పృహే లేదు. మందు దొరికితే చాలంటూ తోసుకుంటూ ఎగబడ్డ దృశ్యాలు దేశమంతా అనేక చోట్ల కనిపించాయి. సరిగ్గా ఈ సందర్భంలోనే ఆన్ లైన్ లిక్కర్ బుకింగ్ తెరపైకి వచ్చింది.

 

మద్యం బ్యాన్ చేసే పరిస్థితిలో ప్రభుత్వాలు లేవు. బ్యాన్ చేయాలని కోరుకునే ప్రజానీకమూ తక్కువే. సాధారణ పరిస్థితుల్లో మద్యం షాపులు, మందుబాబుల గురించి పెద్దగా చర్చించేవాళ్లు కాదు. వాటిదారిన అవి నడుస్తుంటాయి. కానీ, ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ పక్కనే ఉంది. కనిపించని శత్రువు రూపంలో కబళిస్తోంది. ఈ తరుణంలో గతంలోలా వైన్ షాపుల ముందు మూగుతామంటూ సరైన పనికాదు. కానీ, మందుబాబుల ఆత్రం వైరస్ భయాన్ని పట్టించుకునేలా లేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు ప్రభుత్వాలు చూస్తున్నాయి. 

 

ఆఖరికి సుప్రీం కోర్టు కూడా కరోనా ఎఫెక్టును దృష్టిలో ఉంచుకుని మద్యం హోం డెలివరీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించింది. దేశవ్యాప్తంగా మద్యం షాపుల వద్ద రద్దీని తగ్గించేందుకు, సోషల్ డిస్టెన్స్ ప్రొటోకాల్ ను స్ట్రిక్టుగా అమలు చేసేందుకు మద్యం హోం డెలివరీ గురించి ఆలోచించడం మంచిదని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన బెంచ్ అభిప్రాయపడింది.

 

మద్యం షాపుల ముందు సోషల్ డిస్టెన్స్ పాటించడంలేదంటూ మద్యం అమ్మకాల విషయంలో దాఖలైన పిటిషన్‌ పై త్రిసభ్య ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. ప్రభుత్వం నెలరోజులకు పైగా విధించిన లాక్డౌన్తో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలిగామని, కానీ.. మద్యాన్ని నేరుగా విక్రయించడం వల్ల లాక్డౌన్ నిర్వీర్యమవుతుందని పిటిషన్లరు వాదించారు. ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. అంతే కాదు.. భారత్‌ ను కరోనా ఫ్రీ దేశంగా జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించే వరకు మద్యం ప్రత్యక్ష విక్రయాలను నిలిపి వేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం తాము ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదని ధర్మాసనం తెలిపింది. దీనిపై కేంద్రం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. మేము ఎటువంటి ఉత్తర్వులను జారీ చేయము.. కానీ, సోషల్ డిస్టెన్స్ ను కొనసాగించేందుకు మద్యం హోం డెలివరీ చేసే అంశాన్ని ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాలని బెంచ్ అభిప్రాయపడింది.

 

సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మద్యం అమ్మకాలను ఎలా కొనసాగించాలన్న దానిపై రాష్ట్రాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. అసలు లిక్కర్  ఆన్లైన్ లేదా హోం డెలివరీ వంటి పరోక్ష అమ్మకాలు సాధ్యమేనా అనే చర్చ నడుస్తోంది. 

 

ఇప్పటికే పంజాబ్, ఛత్తీస్ గఢ్, బెంగాల్ రాష్ట్రాలు మద్యం హోం డెలివరీ పద్ధతిని మొదలు పెట్టాయి. గ్రీన్ జోన్ల పరిధిలో ఆన్లైన్ ద్వారా మద్యం విక్రయాలు చేపట్టాలని.. ఛత్తీస్ గఢ్ నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేకంగా పోర్టల్‌ ను ప్రారంభించనుంది. ఆ పోర్టల్ ద్వారా మద్యం ఆర్డర్ చేసి ఆన్లైన్లో నగదు చెల్లిస్తే నేరుగా మద్యాన్ని ఇంటికే డోర్ డెలివరీ చేస్తారు. డెలివరీ చార్జీల కింద మద్యం ధరకు అదనంగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. అటు పంజాబ్ లో కూడా లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు మద్యాన్ని హోం డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా ఆన్లైన్లో లిక్కర్ను ఆర్డర్ చేసుకునేందుకు వెబ్ పోర్టల్ను తీసుకొచ్చింది. మరోపక్క ఢిల్లీ ప్రభుత్వం ఈ-టోకెన్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. ఆన్‌ లైన్‌ లో టైమ్‌ స్లాట్‌ ను బుక్ చేసుకొని.. టోకెన్‌ లో ఇచ్చిన సమయానికి వెళ్లి మద్యం కొనుక్కోవాల్సి ఉంటుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: