ఏపీ- తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య నీటి పంప‌కం విష‌యంలో మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 203 ఈ విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌ల‌కు కార‌ణం అవుతోంది. ప్ర‌ధానంగా ఈ విష‌యంలో తెలంగాణ సీఎంను కాంగ్రెస్ నేత‌లు టార్గెట్ చేస్తున్నారు. వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హిస్తూ గులాబీ ద‌ళ‌ప‌తిని ఇర‌కాటంలో ప‌డేస్తున్నారు. ఈ విష‌యంలో తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

 

 

ఏపీ స‌ర్కారు జీవో విష‌యంలో అనుస‌రించాల్సిన వైఖ‌రిపై కాంగ్రెస్ నేత‌లు రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ స‌మావేశ‌మై చ‌ర్చించారు. అనంత‌రం బీఆర్కే భవన్‌లో ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత కుమార్‌ను క‌లిసి మహబూబ్ నగర్,రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లా రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణం స్పందించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. అనంత‌రం కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీకి ఇష్టం వచ్చినప్పుడు గేట్ తెరుచుకుని నీళ్ళను దోచుకుంటుందని అన్నారు. పోతిరెడ్డిపాడు కేసీఆర్, జగన్ ఇంటి సమస్య కాదని, తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య అని అన్నారు. కృష్ణా నుండి నీటిని తరలించేందుకు ఏపీ జీవో తెచ్చినా కేసీఆర్‌కు పట్టడం లేదని  ఆరోపించారు.

 

మే 5న జగన్ ప్రభుత్వం జీవో తెస్తే ..మే 11న కేసీఆర్ సమీక్ష చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అనుమతితోనే ఏపీ సీఎం జగన్ జీవో 203 తెచ్చారని, కేసీఆర్ కేటీఆర్, హరీష్ రావు అందుకే జీవో 203 గురించి మాట్లాడటం లేదని అన్నారు.  55వేల క్యూసెక్కుల నీళ్ళు పోతిరెడ్డి పాడు నుండి వెళుతుంటే ఆరేళ్లుగా కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నాడు పోతిరెడ్డి పాడుపై పీజేఆర్, మర్రి శశిధర్ రెడ్డిలు అలుపెరగని పోరాటం చేశారన్నారు. పోతిరెడ్డి పాడు నీళ్ళ దోపిడీని కాంగ్రెస్ అడ్డుకుని తీరుతుందన్నారు. పోతిరెడ్డి పాడు జల దోపిడీపై పీఎం మోడీ, జలవనరుల శాఖ మంత్రికి లేఖలు రాస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: