ఇప్పటికే కరోనా వైరస్ తో అల్లాడిపోతున్న కోస్తాంధ్ర వాసులకు మరో ముప్పు పొంచి ఉంది. తుఫాన్ ఉగ్రరూపంతో విరుచుపడేందుకు సిద్ధంగా ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తుఫాన్ గా గర్జించబోతోంది. ఈ ప్రభావంతో కోస్తాంధ్రతో పాటు.. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో జోరుగా భారీ వర్షాలు కురవబోతున్నాయి.   

 

ఆగ్నేయ బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా.. తర్వాత వాయుగుండంగా మారింది. ఇది మరింత బలపడి తుఫాన్‌గా మారుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి ఎంఫాన్‌గా నామకరణం చేశారు అధికారులు. ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవులకు దక్షిణ దిశలో కిలోమీటర్ ఎత్తున ఎంఫాన్ తుఫాన్ కేంద్రీకృతమై ఉంది.    


    
వాయుగుండం దక్షిణ మధ్య బంగాళాఖాతం దిశగా ప్రయాణించి.. ఆదివారం ఉదయానికి తుఫాన్‌గా మారనుంది. తొలుత వాయవ్య దిశగా పయనించి... తర్వాత ఉత్తర ఈశాన్యం వైపు దిశ మారే క్రమంలో తుఫాన్‌ బలపడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఆదివారం 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైనగాలులు వీస్తాయంటున్నారు.  సోమవారం ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరం వెంబడి గాలులు తీవ్రత ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.    

 

ఎంఫాన్ పెను తుఫాన్‌గా మారేందుకు బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణం అనుకూలంగా ఉందంటోంది వాతావరణ శాఖ. అలాగే సోమవారం తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లకూడదని సూచించింది. ప్రస్తుతం స్థిరంగా ఉన్న వాయుగుండం.. తుఫాన్‌గా మారిన తరువాత దాని దిశను ఖచ్చితంగా అంచనా వేయడానికి వీలవుతుందంటున్నారు వాతావరణ నిపుణులు.    

 

ఈ ఏడాది నైరుతి రుతు పవనాల రాక ఆలస్యం కానుందని భారత వాతావరణ విభాగం చెబుతోంది. తుఫాన్ ప్రభావంతో రుతు పవనాల రాకలో జాప్యం కలిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. సాధారణంగా ప్రతీ ఏడాది జూన్ ఒకటో తారీఖు నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి. ఈ సారి నాలుగు రోజులు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. జూన్‌ ఐదు తర్వాత రుతుపవనాలొచ్చే వీలుంది. అలాగే ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందంటున్నారు వాతావరణ నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: