క‌రోనా మ‌హ‌మ్మారి గ‌త రెండు నెల‌లుగా ప్ర‌పంచ దేశాల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తుండ‌టంతో అగ్ర‌రాజ్యం అమెరికా చిగురుటాకులా వ‌ణికిపోతోంది. అన్ని వ‌ర్గాలు తీవ్రంగా ప్ర‌భావితం అవుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 14 ల‌క్ష‌ల మందికిపైగా అమెరిక‌న్లపై క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం చూపింది. మ‌రో 85 వేల మందికి పైగా అమెరిక‌న్ల‌ను పొట్ట‌న పెట్టుకుంది. అంతేకాదు, అక్క‌డి ఆర్థిక వ్య‌వ‌స్థపైనా క‌రోనా తీవ్ర ప్ర‌భావం చూపింది. దీంతో ఇటు ఉద్యోగాలు అటు వ్యాపారా‌లు తీవ్రంగా ప్ర‌భావితం అయ్యాయి.

 

అమెరికాలో క‌రోనా ర‌క్క‌సి విలయ తాండ‌వంతో చిరు వ్యాపారాలు చితికిపోయాయి. మే 9 నుంచి 11 తేదీల మ‌ధ్య యూనివ‌ర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌, హార్వ‌ర్డ్ బిజినెస్ స్కూల్‌, హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ, యూనివ‌ర్సిటీ ఆఫ్ చికాగోల‌కు చెందిన ప‌లువురు ఆర్థిక‌వేత్త‌లు క‌లిసి ఇటీవ‌ల నిర్వ‌హించిన ఒక అధ్య‌య‌నం ప్ర‌కారం... క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా గ‌త మార్చి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అమెరికాలో ఒక ల‌క్ష‌కు పైగా చిన్నచిన్న వ్యాపార సంస్థ‌లు మూత‌ప‌డ్డాయి. ఆయా సంస్థ‌ల‌పై ఆధార‌ప‌డి బ‌తుకున్న ల‌క్ష‌ల మంది జీవితాలు దుర్భ‌రంగా మారాయి. మొత్తంగా అమెరికాలోని మొత్తం చిరు వ్యాపార సంస్థ‌ల్లో రెండు శాతం పూర్తిగా మూత‌ప‌డిపోయాయ‌ని ఈ అధ్య‌య‌నంలో తేలింది. కరోనా నేపథ్యంలో లక్షల వ్యాపారాలను మూసివేయడంతో ఉద్యోగులంతా ఉపాధి లేక ఇళ్ల‌కే పరిమితం అయ్యారని అమెరికా కార్మికశాఖ తెలిపింది. 

 

మ‌రోవైపు, అమెరికాలో నిరుద్యోగం మ‌రింత తారాస్థాయికి చేరింది. క‌రోనాతో ఉద్యోగాలు పెద్ద ఎత్తున పోయిన నేప‌థ్యంలో  గత రెండు నెలల్లో నిరుద్యోగ భృతి కోసం 3.6 కోట్ల మంది దరఖాస్తు చేసుకోవ‌డం అక్క‌డి నిరుద్యోగానికి అద్దం ప‌డుతోంది. అమెరికాలో చిన్న వ్యాపారాల‌పై పెద్ద‌ దెబ్బ ప‌డింద‌ని దీంతో తాత్కాలిక‌, శాశ్వ‌త ఉపాధి సైతం పెద్ద ఎత్తున ప్ర‌భావితం అయ్యాయి. దీంతో నిరుద్యోగ భృతికి ద‌ర‌ఖాస్తులు వెల్లువెత్తున్నాయి. అదే స‌మ‌యంలో అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణ‌యంపై నిరీక్ష‌ణ కొన‌సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: