'జనసేన' ఆవిర్భావ సభలో పవన్ కల్యాన్ ప్రసంగం అభిమానుల చేత అదుర్స్ అనిపించుకొంది. కొత్త పార్టీని నడిపించే సత్తా పవన్ కు ఉందన్న రీతిలో సాగిన ఆ ప్రసంగం అభిమానుల రక్తాన్ని వందమైళ్ల వేగంతోపరుగులెత్తించింది. భవిష్యత్తు మనదే అనిపించేలా సాగింది. ఈ భావోద్వేగాల నుంచి పక్కకు వచ్చి చూస్తే పవన్ కల్యాన్ ప్రసంగంలో కొన్నిడొల్ల మాటలున్నాయి. అభిమానులను అమితంగా అలరించిన పవన్ ప్రసంగంలో కొన్ని విచిత్రమైన మాటలున్నాయి. ఆత్మస్తుతి, పరనింద అనే భావన కనిపిస్తుంది. వారసత్వ రాజకీయాలను తప్పుపట్టాడు పవర్ స్టార్! రాజకీయాల్లో వారసత్వం ఏమిటని ఆయన ప్రశ్నించాడు. ఒకరి తర్వాత ఒకరుగా ఒకే ఇంటి నుంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం ఏమిటని ఆయన ప్రశ్నించాడు! అయితే వారసత్వ పోకడకు నిలువెత్తు నిదర్శనం పవన్ కల్యాన్ ఫ్యామిలీ. చిరంజీవి ఫిలిమ్ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యాకా నాగబాబు వచ్చాడు. ఆ తర్వాత పవన్ కల్యాన్ వచ్చాడు. రామ్ చరణ్ తేజ వచ్చాడు. ఇప్పుడు నాగబాబు తనయుడు హీరోగా వస్తున్నాడు. వారంతా చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లు కాదా? సినిమాను తమ వారసత్వంగా భావించిన వాళ్లు కాదా? ఇక వాళ్లే అనుకొంటే ఇప్పుడు చిరంజీవి, పవన్ కల్యాన్ ల మేనలుళ్లు కూడా సినిమాల్లోకి వచ్చేస్తున్నారు! వారు కూడా మామయ్య ల పేర్లు చెబుతూ లబ్ధి పొందుదామని ప్రయత్నిస్తున్నారు. మరి వారసత్వ పోకడ తప్పు అయినప్పుడు అది రాజకీయాల్లో మాత్రమే తప్పు అవుతుందా? సినిమాల్లో కూడా అది తప్పు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం తగదని పవన్ తన వాళ్లకు హితబోధ చేయవచ్చు కదా! సరే సినిమాల్లో అది సహజం అనుకొంటే.. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన కొత్తల్లో పవన్ కల్యాన్ యువరాజ్యం అధినేతగా నియమితం అయ్యాడు! మరి ఏ అర్హతతో ఆయన యువరాజ్యానికి అధ్యక్షుడయ్యాడు? చిరంజీవి తమ్ముడు కావడం వల్ల కాదా?! అప్పట్లో పవన్ కు వారసత్వ రాజకీయాలు తప్పు అనిపించలేదా? ఇలాంటి విశ్లేషణలు అభిమానులకు రుచించకపోవచ్చు. నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: