కరోనా ప్రభావం బోనాల ఉత్సవాలపై పడింది. ఈ సారి సామూహిక బోనాలు ఉండబోవని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. భక్తులు బోనాలు ఇళ్లలోనే సమర్పించుకోవాలని తేల్చిచెప్పింది. ప్రభుత్వం తరపున సమర్పించాల్సినవి మాత్రం యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. 

 

ఆషాఢం వచ్చిందంటే చాలు.. అమ్మకు బోనం లేస్తుంది. వర్షాకాలం ఆరంభంలో మహమ్మారుల బారి నుంచి తమను కాపాడాలని.. వర్షాలు బాగా కురవాలని కోరుకుంటూ అమ్మవారికి బోనం సమర్పించడం ఏళ్లుగా వస్తున్న ఆచారం. బోనాల ఉత్సవాల తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు ప్రతీక. కానీ ఈసారి కరోనా వైరస్ పొంచి ఉండటంతో.. సామూహిక ఉత్సవాలకు బ్రేకులు పడ్డాయి. 

 

కరోనా కాలంలో భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత కచ్చితంగా పాటించాల్సిన పరిస్థితి. పైగా సామూహిక ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లేదు. దీంతో బోనాల నిర్వహణపై ప్రజల్లో ఆందోళన నెలకొన్నది.

 

ఊరేగింపుల్లో లక్షల సంఖ్యలో పాల్గొంటే వైరస్‌ భీకరంగా వ్యాపించే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. బోనాలు ఇళ్లలోనే సమర్పించుకోవాలని భక్తులకు సూచించింది. 

 

రోగాలు రాకూడదని కోరుకొనే వారే.. విశృంఖలంగా వ్యాపిస్తున్న రోగాల నడుమ ఊరేగింపులు, సామూహిక పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం సరికాదని పూజారులు, పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో కరోనా ఉధృతి ఉండటం, బోనాల ఊరేగింపుల్లో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉండంతో.. కరోనా శరవేగంగా విస్తరిస్తుందనే ఆందోళన ఉంది.

 

దీంతో ఈసారికి బోనాల ఉత్సవాన్ని నిర్వహించకపోవడమే మంచిదని అన్ని వర్గాలూ అభిప్రాయపడ్డాయి. దీంతో ప్రభుత్వం కూడా సామూహిక బోనాలు ఉండబోవని తేల్చేసింది. భక్తులు దేవాలయానికి వెళ్లి బోనం సమర్పించడం ఆనవాయితీ. కరోనా ఉంది కాబట్టి ఈ సారి ఇంట్లోనే పండుగ చేసుకుంటే ఎలాంటి దోషాలు ఉండవని చెబుతున్నారు. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: