ఏపీలో రాజకీయాలు వేడెక్కిపోయాయి. మూడు నెలల పాటు కరోనా వల్ల ఆగిన రాజకీయం కాస్తా ఇపుడు ఊపందుకుంది. మళ్ళీ కండువాలు కప్పుతున్నారు. ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నారు. ఇపుడు అన్నీ కలసి అరెస్టుల పర్వం దాకా కధ వచ్చింది. సీనియర్ టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ తో ఇపుడు ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి.

 

ఓ విధంగా తెలుగుదేశం పార్టీకి గట్టి స్ట్రోక్ గా ఈ సంఘట‌నను చెప్పుకోవాలి. అచ్చెన్న ఇపుడు చంద్రబాబుకు కుడిభుజంగా ఉన్నారు. అచ్చెన్న అండను చూసుకుని చంద్రబాబు కాస్తా ధీమాగా ఉన్నారు. చంద్రబాబు గత ఏడాదిగా ఎటువంటి ఆందోళనలు  చేసినా కూడా అచ్చెన్న కచ్చితంగా పక్కన ఉండాల్సిందే.  ఇక ఉత్తరాంధ్రాలో అచ్చెన్న బలమైన నేతగా ఉన్నారు.

 

అదే సమయంలో ఆయన ఏపీలో దూకుడు రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు అరెస్ట్ అన్నది టీడీపీ ఊహించలేకపోతోంది. అచ్చెన్న వంటి నేతనే అరెస్ట్ చేస్తేనే ఇక మిగిలిన వారి సంగతేంటన్న ఆలోచన కూడా పసుపు శిబిరంలో కలుగుతోంది. ఓ విధంగా కలవరపాటుకు కూడా నేతలు గురి అవుతున్నారు.

 

మరో వైపు చూసుకుంటే ఇది ఆరంభం మాత్రమేనని వైసీపీ నేతలు అంటునారు. అచ్చెన్నాయుడుతో మొదలుపెట్టి చంద్రబాబు దాకా వస్తామని వైసీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. మరో వైపు వైసీపీ  ఎమ్మెల్యే  ఆర్ కే రోజా  అరెస్టులు ఆగవని  అంటున్నారు. దానికి ముందు లోకేష్ అరెస్ట్ కూడా ఉంటుందని ఆమె హింట్ ఇచ్చారు. ఇపుడు చూసుకుంటే పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి.

 

చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి కార్యక్రమాలపైన సీబీఐ విచారణకు ఆదేశించాలని తాజాగా వైసీపీ  మంత్రివర్గం నిర్ణయించింది. దాంతో ఏపీలో రాజకీయ పరిణామాలు రానున్న రోజుల్లో మరింతగా మారుతాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. మొత్తానికి ఏపీ పాలిటిక్స్ లో గట్టి కుదుపు ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి: