క‌రోనా కష్ట‌కాలంలో తెర‌మీద‌కు వ‌చ్చిన అనేకానేక అంశాలు స‌మ‌స్య‌ల్లో మార‌టోరియం ఒక‌టి. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆరు నెలలపాటు అన్ని రుణాల చెల్లింపులను వాయిదా వేసుకునే వెసులుబాటును అటు బ్యాంకర్లకు, ఇటు రుణగ్రహీతలకు ఆర్బీఐ కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆర్నెళ్ల వాయిదాలపై మళ్లీ వడ్డీ పడుతుండటంతో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై అశోక్‌ భూషణ్‌, ఎస్‌కే కౌల్‌, ఎంఆర్‌ షాలతో కూడిన న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ జరుపుతోంది. మారటోరియం సమయంలో అదనపు వడ్డీ రద్దుపై మూడు రోజుల్లోగా తేల్చాలని కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌లను సుప్రీం కోర్టు ధ‌ర్మాస‌నం ఆదేశించింది. ఈ అంశంపై సమావేశమై ఓ నిర్ణయానికి రావాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐలకు అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 

 

కరోనా వైరస్‌ నేపథ్యంలో వచ్చిపడిన లాక్‌డౌన్‌తో యావత్‌ దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయిన విషయం తెలిసిందే. దీంతో మార‌టోరియం క‌ల్పించ‌గా దానిపై వ‌డ్డీ బాదుతున్నారు. దీనిపై ఆగ్రాకు చెందిన గజేంద్ర శర్మ ఈ పిటిషన్‌ దాఖలు చేయగా, ప్రభుత్వం తరఫున ఈ కేసులో సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహెతా వాదిస్తున్నారు. ఆర్బీఐతో సమావేశానికి ప్రయత్నిస్తున్నామని తుషార్‌ చెప్పిన తాజా సమాధానం నేపథ్యంలోనే మూడు రోజుల్లోగా తేల్చాలని సుప్రీం స్పష్టం చేసింది. మారటోరియం లో రుణ చెల్లింపులపై అసలు వడ్డీనే వసూలు చేయవద్దని కూడా తన పిటిషన్‌లో శర్మ కోరారు. ఈ మేరకు కేంద్రానికి, ఆర్బీఐకి ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. 

 


దీనిపై ధ‌ర్మాస‌నం స్పందిస్తూ, మొత్తం మారటోరియం వ్యవధిలో పూర్తిగా వడ్డీని రద్దు చేయాలని చెప్పడం లేదని, వడ్డీపై బ్యాంకులు వేస్తామంటున్న వడ్డీపై ఓ నిర్ణయానికి రావాలని ధర్మాసనం చెప్పింది. వడ్డీపై వడ్డీని రద్దు చేసే వీలుందా? అన్నదానిపై స్పష్టత కావాలని సూచించింది. అలాగే ఆర్బీఐతో సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయంపై ఓ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కేంద్రానికి చెప్పింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: