ఆంధ్రప్రదేశ్‌ శాససనభ బడ్జెట్‌ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనేది బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నప్పటికీ, కరోనా కారణంగా రెండురోజులు మాత్రమే జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దేశ చరిత్రలోనే తొలిసారి.. బడ్జెట్‌ సమావేశాల ప్రసంగాన్ని గవర్నర్.. ఆన్‌లైన్ నుంచి చేయనున్నారు. 

 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా కల్లోలంతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పై తర్జనభర్జనలు పడిన తర్వాత రెండు రోజుల పాటు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. ఉదయం 9గంటలకు ప్రత్యేక కేబినెట్‌ సమావేశం ఉంటుంది. పది గంటలకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ విజయవాడలోని రాజ్‌భవన్‌ నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ పద్ధతిలో ఉభయ సభలను  ఉద్దేశించి ప్రసంగిస్తారు. శాసనసభ, శాసనమండలి సభ్యులు తమ తమ సభల నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశంలో పాల్గొంటారు. 
.

 

గవర్నర్‌ ప్రసంగం తర్వాత బీఏసీలను నిర్వహిస్తారు. బీఏసీ సమావేశాలు విడివిడిగా శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్, శాసన మండలి చైర్మన్‌ అహ్మద్‌ షరీఫ్‌ చాంబర్లలో జరుగుతాయి. కార్యక్రమాల ఖరారుపై నిర్ణయం తీసుకున్న తర్వాత రెండు సభలు విడివిడిగా సమావేశమవుతాయి. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ చర్చ కూడా క్లుప్తంగా సాగుతుందని సమాచారం. చర్చ అనంతరం తీర్మాన ఆమోదం జరుగుతుంది.  తరువాత ఉభయ సభల్లో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు.

 

రెండో రోజు అంటే 17న ప్రభుత్వం కొన్ని బిల్లులు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. అదే రోజున ఉభయ సభలూ దశల వారీగా ప్రభుత్వ శాఖల పద్దులను, ద్రవ్య వినిమయ బిల్లును కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఈ మోత్తం ప్రక్రియ 17 సాయంత్రం లోపు పూర్తి కావాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది.

 

ఇక కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఉభయ సభలకు వచ్చే సభ్యులందరికీ పరీక్షలు నిర్వహిస్తారు. అనారోగ్యంతో గాని, కరోనా లక్షణాలతో గాని ఉన్న సభ్యులను సభలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సభ్యులు తమతో పాటు భద్రత, సహాయ, ఇతర వ్యక్తులను ఎవరినీ తీసుకురావద్దనీ విజ్ఞప్తి చేస్తు అసెంబ్లీ కార్యదర్శి ఇప్పటికే ప్రత్యేక బులెటిన్‌ విడుదల చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: