ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మా‌రి సృష్టించిన స‌మ‌స్య‌లు ఒక‌టీ రెండు కాదు. ఈ అనూహ్య‌మైన సంక్లిష్ట ద‌శ‌లో కొన్ని ఊహించ‌ని అంశాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. తాజాగా కార్ల కొనుగోలు విష‌యంలో అదే అంశం వెలుగులోకి వ‌చ్చింది. సొంత కారు ఉండడంపై  ఓ సంస్థ‌ కస్టమర్‌ సర్వే చేసింది. లాక్‌డౌన్‌ ముగిశాక సొంతంగా కారు కొనుక్కోవాలని 40–45 శాతం కస్టమర్లు చెప్పారని పేర్కొంది. అయితే, వీరిలో సెకండ్ హ్యండ్ కార్లే కొనుక్కుంటామ‌ని ప్ర‌క‌టించిన వారి సంఖ్యే ఎక్కువ‌! మ‌రోవైపు ఈ రంగంలో డిమాండ్‌‌ పుంజుకోకపోతే వెహికల్‌‌ విడిభాగాల ఇండస్ట్రీ మరింత ప్రమాదంలో పడుతుందని తాజాగా వెల్లడయింది. గిరాకీ పెరగకపోతే చాలా మంది జాబ్స్‌‌ కోల్పోతారని ఆటోమోటివ్‌‌ కాంపోనెంట్‌‌ మాన్యుఫ్యాక్చరర్స్‌‌ అసోసియేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా (ఏసీఎంఏ) హెచ్చరించింది. 

 

కార్ల కొనుగోలు విష‌యానికి వ‌స్తే, క‌రోనా నేపథ్యంలో సేఫ్టీ కోసం సొంత వెహికల్‌ ఉండడం మంచిదని కస్టమర్లు భావిస్తున్నారని తాజా అధ్య‌య‌నంలో తేలింది. లాక్‌డౌన్‌కి ముందు కారు కొనాలనుకునే కస్టమర్ల ఆలోచనలోనూ మార్పులొస్తున్నాయట‌. వీరిలో 23 శాతం మంది కొత్త కారుకి బదులు సెకెండ్‌ హ్యాండ్‌ కారు  కొనడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. లాక్‌డౌన్‌తో కస్టమర్ల ఆదాయం పడిపోవడం కూడా ఇందుకు కారణమని త‌మ భావ‌న‌ను వెల్ల‌డించారు. లాక్‌డౌన్‌ ముందుతో పోలిస్తే వీటి ధరలు తగ్గడం కూడా దీనికొక కారణమని సర్వేలో పాల్గొన్న‌వారు స్ప‌ష్టం చేశారు. మారుతీ  స్విఫ్ట్‌, హ్యుండయ్ శాంట్రో జింగ్‌, హ్యుండయ్‌ గ్రాండ్‌ ఐ 10, హోండా సిటీ, మారుతీ స్విఫ్ట్‌ డిజైర్‌‌ వంటి ఐదు మోడళ్లకు కస్టమర్ల నుంచి డిమాండ్‌ ఎక్కువగా ఉందట‌. సెకండ్‌ హ్యాండ్‌ కార్ల ధరలు తగ్గడం కూడా వీటి డిమాండ్‌ పెరగడానికి కారణంగా ఉందని చెప్పారు. గతంలో సగటున రూ. 2.6 లక్షలున్న కారు, ప్రస్తుతం రూ.2.25 లక్షలకు తగ్గిందని తేలింది.

 

మ‌రోవైపు ఈ రంగంలో పెట్టుబ‌డులు పేరుకుపోగా, డిమాండ్‌‌ మాత్రం ఇంకా పుంజుకోలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కంపెనీలు ఉద్యోగులను విపరీతంగా తొలగిస్తాయని ఆటోమోటివ్‌‌ కాంపోనెంట్‌‌ మాన్యుఫ్యాక్చరర్స్‌‌ అసోసియేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా ఆందోళన చెందింది. ‘‘గిరాకీ పెరిగే వరకు కంపెనీలకు డబ్బు సమస్యలు ఉంటాయి. ఉద్యోగులను తీసేయడమూ తప్పదు. పరిస్థితి మామూలు స్థితికి వస్తేనే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి’’ అని ఏసీఎంఏ ప్రెసిడెంట్‌‌ దీపక్‌‌ జైన్‌‌ అన్నారు. కంపెనీలు పూర్తిస్థాయిలో పనిచేసినా, ఉద్యోగులందరూ అవసరం లేదని, డిమాండ్ తక్కువ ఉండటమే ఇందుకు కారణమని వివరించారు. లాక్‌‌డౌన్‌‌ వల్ల గిరాకీ 40 శాతం వరకు తగ్గుతుందని ఆటో ఇండస్ట్రీ బాడీ సియామ్‌‌ ఇది వరకే చెప్పిన విషయాన్ని దీపక్ గుర్తుచేశారు. దీనినిబట్టి చూస్తే జాబ్‌ కట్స్‌‌ తప్పకపోవచ్చని అభిప్రాయపడ్డారు.ఆటో కాంపోనెంట్‌‌ ఇండస్ట్రీలో దాదాపు 50 లక్షల మంది పనిచేస్తున్నారని అంచనా. గత ఏడాది దీని మార్కెట్‌‌ 18 శాతం తగ్గింది.

మరింత సమాచారం తెలుసుకోండి: